టాలీవుడ్లో మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుల్లో వీవీ వినాయక్ ఒకరు. ఆయన నుండి ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమా రాకపోతుందా? ఎంజాయ్ చేయకపోతామా అని ఫ్యాన్స్ ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన ఇంకో విషయానికి కూడా ప్రసిద్ధి. అదే వారసుల్ని వెండి తెరకు తీసుకురావడానికి, అలాగే అప్పటికే వచ్చేసిన వారసులకు ఊహించని విజయాలు ఇవ్వడానికి. ఇప్పుడు మరోసారి ఆయన అదే పని చేస్తున్నారా? ఏమో పుకార్లు అయితే అలానే అంటున్నాయి.
‘ఆది’, ‘దిల్’, ‘బన్నీ’, ‘నాయక్’… ఈ సినిమాల్లో కామన్ పాయింట్. ఇవన్నీ వారసుల సినిమాలే. అలా అని తొలి సినిమాలు కాదు. సరైన విజయం లేననప్పుడు ఆయా వారసులకు ఈ సినిమాలతో భారీ విజయం, కమర్షియల్ లుక్ అందించారు వినాయక్. ఇప్పుడు మరోసారి తన స్టైల్లో మరో యంగ్ హీరోకు సినిమా చేస్తున్నారు అని అంటున్నారు. ఆ హీరోనే విరాట్ కర్ణ. అయితే ఇప్పుడు వినాయక్ ఉన్న ఫామ్‌లో వారసుడితో సినిమా అంటే కష్టమే అనే మాటలూ వినిపిస్తున్నాయి.
వీవీ వినాయక్ (Vv Vinayak) చివరగా బాలీవుడ్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేశారు. ఇక తెలుగులో అయితే 2018లో సాయిధరమ్ తేజ్‌తో ‘ఇంటెలిజెంట్’ అనే సినిమా చేశారు. వీటి తర్వాత చిరంజీవి సినిమా ఒకటి ఉంటుంది అని వార్తలొచ్చినా అది కుదర్లేదు. హీరోగా ఓ రెండు ప్రాజెక్టులు అనుకున్నా అవి ముందుకెళ్లలేదు. ఇప్పుడు ‘పెదకాపు’ హీరో విరాట్‌తో ఓ సినిమా ఉంటుంది అని టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఓ కథ సిద్ధం చేస్తున్నరాట వినాయక్ టీమ్.
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడే విరాట్ కర్ణ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘పెదకాపు’ సినిమాతో వచ్చిన విరాట్ ఇబ్బందికర ఫలితం అందుకున్నాడు. అందుకే ఈసారి పూర్తి మాస్ సినిమా కావాలని వినాయక్‌తో వస్తున్నాడట. ఈ కాంబినేషన్ వివరాలు త్వరలో తెలుస్తాయంటున్నారు. సరైన విజయం లేని ఇద్దరు కలసి అదిరిపోయే సినిమా చేయాలని కోరుకుందాం.