ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఆశగా ఎదురుచూస్తుంటే.. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అంత డిలే చేస్తుంది. ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్, అందులోనూ హృతిక్ కి పోటీగా అంతే మాములు విషయమా?. అలాంటిది ఆ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క టీజర్ తప్ప ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు. విడుదలవుతున్న పోస్టర్స్ కూడా ఆసక్తి రేకెత్తించేలా లేవు. దాంతో.. ఆగస్ట్ 14న విడుదలవుతున్న “వార్ 2” సినిమా ట్రైలర్ ఎప్పడు వస్తుందా? అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
సాధారణంగా బాలీవుడ్ సినిమాల ట్రైలర్లు కనీసం రెండు లేదా మూడు నెలల ముందు రిలీజ్ అవుతాయి. హాలీవుడ్ స్టైల్ ను ఫాలో అవుతుంటారు. కానీ.. మొదటిసారి ఓ బాలీవుడ్ సినిమా ట్రైలర్ ను కనీసం రెండు వారాల ముందు కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం తెలుగు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా యూనిట్ తీసుకున్న డెసిషన్ అయితే.. ట్రైలర్ ను రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఇంకాస్త స్పెషల్ గా డెలివరీ చేసేందుకు టీమ్ పడుతున్న తాపత్రయం మరో కారణమని తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ట్రైలర్ లో హృతిక్ & ఎన్టీఆర్ ను సమానంగా చూపించేందుకు బృందం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని కూడా సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 25న “వార్ 2” ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ముంబై & హైదరాబాద్ లో ఒకేసారి ఈవెంట్లు కూడా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. తెలుగులో మాత్రం నాగవంశీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం సపరేట్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ట్రైలర్ స్క్రీనింగ్ మాత్రమే కాక స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడట. మరి అందుకు వై.ఆర్.ఎఫ్ సంస్థ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.