థళపతి అంటూ విజయ్‌ను అభిమానులు, తమిళ పరిశ్రమ, ట్రేడ్ వర్గాలు ముద్దుగా పిలుచుకుంటున్నాయి. అయితే కెరీర్ ప్రారంభమైన తొలి రోజు నుండి అతను థళపతి కాదు, అసలు విజయ్‌ను హీరోగా అంగీకరించడానికి తొలినాళ్లలో ఎవరూ అంగీకరించలేదనే విషయం మీకు తెలుసా? విజయ్‌ను తొలి నుండి ఫాలో అవుతున్న వాళ్లకు ఈ విషయం తెలిసుండొచ్చు. అది పక్కనపెడితే… ఇప్పుడు విజయ్ సినిమా విడదలైతే… సందడే సందడి. మరి తొలి సినిమా విడుదలైనప్పుడు ఏం జరిగింది?
అది 1992.. విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్ – శోభ తిరిగి ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయం. సరిగ్గా అప్పుడే విజయ్ వచ్చి… ‘నేను సినిమాల్లోకి వెళతాను’ అని ఇంట్లో పట్టుబట్టాడట. దీంతో చంద్రశేఖర్ చేసేది లేక అప్పు తెచ్చి ₹60 లక్షలతో విజయ్‌ని హీరోగా పెట్టి ‘నాళయ తీర్పు’ తీశారు. కానీ… సినిమా దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో విజయ్ నటనను సినిమా క్రిటిక్స్ చీల్చి చెండాడారు.
‘విజయ్‌కేం! వాళ్ల నాన్న డైరెక్టర్ కాబట్టి హీరో అయ్యాడు’… ఇది ఆ సమయంలో ఎక్కడ చూసినా వినిపించిన మాట. ‘తండ్రి దర్శకుడైనంత మాత్రాన హీరోగా వస్తే ఎలా!’ అంటూ తూర్పారబట్టారు. సరిగ్గా ఆ రోజు క్రిస్మస్. ఆ రాతల్ని చూసి కొత్త బట్టలన్నీ విసిరేసి భోరుమని ఏడుస్తూ కూర్చున్నాడట విజయ్. రెండు నెలలపాటు స్నేహితుల్ని కూడా ఇంటికి రానివ్వలేదు. అయితే ఆ స్నేహితులే ఆ తర్వాత విజయ్‌ని మళ్లీ మనిషిని చేశారట. ‘పొగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలిరా’ అంటూ ధైర్యం నూరిపోశారట. ఆ ధైర్యమే ఇప్పుడు మనకు థళపతిని ఇచ్చింది.