ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలిచి రాజీనామా చేసిన వారి స్థానాలను భర్తీ చేయడం మంచు విష్ణు ముందున్న పెద్ద సవాలు అని చెప్పొచ్చు. విష్ణు ఒకవేళ ఆ 11 మంది రాజీనామాలను ఆమోదిస్తే… వారి స్థానంలో కొత్త వారిని నియమించాలి. సభ్యుల్లో ఒకరో, ఇద్దరో రాజీనామా చేస్తే… బుజ్జగించి ఉండమని చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు మూకుమ్మడిగా 11 మంది రాజీనామాలు చేశారు. దీంతో విష్ణుకు ఆ ఆప్షన్ లేదు. పోనీ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ వెనకడుగు వేస్తుందా అంటే… ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ అవకాశం లేదనేది మరో మాట.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వారిని నియమించటమే విష్ణు ముందున్న ఏకైక మార్గం అని అంటున్నారు. ‘మా’లో ఓ స్థానం ఖాళీ అయితే, దాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. ‘మా’ బై లా రూల్ పొజిషన్ 17 ప్రకారం… పోస్ట్ ఖాళీ ఏర్పడితే, అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని భర్తీ చేస్తారు. ఆ పదవికి మరొక వ్యక్తిని నామినేట్ చేస్తారు. ఆ నియామకం జనరల్ బాడీ మీటింగ్‌లో సభ్యుల అనుమతి తీసుకోవాలి. సర్వసభ్య సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ అనుమతి విషయంలో విష్ణుకు సమస్య ఉండదు. కాబట్టి విష్ణు ఈ విధానానికే ఓటేస్తాడని అంటున్నారు.
ఉదాహరణకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవినే చూద్దాం. ఈ స్థానంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుండి గెలిచిన శ్రీకాంత్ రాజీనామా చేశారు. అతనిపై తన ప్యానల్ నుండి పోటీ చేసి ఓడిపోయిన బాబూమోహన్‌ను తిరిగి నామినేట్ చేయవచ్చు. ఇలా ప్రతి పోస్టుకు ఒక వ్యక్తిని నామినేట్ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. అయితే ఇప్పుడు విష్ణు ఎవరిని నామినేట్ చేస్తారు అనే ఆసక్తికర అంశం. ఓడిపోయిన ప్రతి ఒక్కరినీ నామినేట్ చేస్తే పెద్ద సమస్య లేదు. వారి బదులు వేరొకరిని తీసుకుంటే… అలకలు మొదలవుతాయి.