1994లో శ్రీకాంత్ (Srikanth) -ఊహ (Ooha) జంటగా విడుదలైన “ఆమె” సినిమాలో మావయ్య పాత్ర పోషించిన కోట శ్రీనివాసరావు ఊహను బలవంతం చేయడానికి ప్రయత్నించే సన్నివేశం గుండెల్ని కలచివేసింది. ఆ సినిమా రిలీజైన కొన్నాళ్లకి కోట శ్రీనివాసరావును (Kota Srinivasa Rao) రైల్వే స్టేషన్ లో చూసిన ఒకావిడ తెగ తిట్టేసిందట. ఒక పాత్ర జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయింది అని చెప్పడానికి అదొక నిదర్శనంలా నిలిచింది అప్పట్లో. కానీ.. ఇప్పుడు లిప్ లాకులు, శృంగార సన్నివేశాలు కామన్ అయిపోయి, తెరపై బలవంతం చేసే విలన్ల స్టైల్ ను జనాలు మెచ్చుకుంటున్న తరుణంలో ఒక పాత్ర పోషించినందుకు సదరు నటుడ్ని కొట్టడం అనేది 99% జరిగే అవకాశం లేదు.
ఆలాంటిది ఇటీవల విడుదలైన “లవ్ రెడ్డి” (Love Reddy) అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థియేటర్ కి వెళ్లిన బృందానికి ఓ వింత అనుభవం ఎదురైందని, సినిమాలో తండ్రి పాత్ర పోషించిన ఎన్.టి.రామస్వామి అనే నటుడ్ని పట్టుకొని ఓ ప్రేక్షకురాలు చెంప మీద కొట్టడం, కూతుర్ని చంపుతావా *** కొడకా అని బూటులు తిట్టడాన్ని స్వయంగా సినిమా బృందం “కాంట్రవర్సియల్ వీడియో” అని ప్రమోట్ చేసుకోవడం అనేది హాస్యాస్పదంగా మారింది.
ఇంకా జనాలు సినిమాలో చూసి నటీనటుల్ని తిట్టడం, కొట్టడం అనేది జరుగుతుందా? అనేది సినిమా బృందం వారిని వారు ప్రశ్నించుకోవాల్సిన విషయం. అసలే సినిమాకు కలెక్షన్స్ లేవు, పైగా ఫెయిల్యూర్ మీట్ అని నిర్వహించుకొని తమ సినిమాకి తామే నష్టం కలిగించుకున్నారు.
ఇప్పుడు ఈ తరహా ప్రమోషన్స్ కారణంగా సినిమాను ప్రేక్షకుల నుండి మరింత దూరం చేస్తున్నారు. మరి “లవ్ రెడ్డి” బృందం ఈ హంగామా కారణంగా ఏం లాభం పొందుతారో తెలియదు కానీ.. మీమర్స్ కు మాత్రం మంచి కంటెంట్ ఇచ్చారు. ఈ కాంట్రవర్సీ వీడియోని జనాలు నవ్వుతూనే షేర్ చేయడం అనేది కొసమెరుపు.
— Ajay Tarak (@ProudToBeNTRFan) October 25, 2024