ఇండస్ట్రీలో దిల్ రాజును అందరివాడు అంటూ ఉంటారు. అంటే ఇటు పెద్ద హీరోల సినిమాలను, అటు చిన్న హీరోలను సినిమాలను ఒకేలా చూస్తూ విడుదల చేస్తుంటారని పేరు. పెద్ద హీరోల సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేస్తే.. చిన్న హీరోలను సినిమాలకు అన్నీ తానై ముందుకెళ్తుంటారు. అయితే ఇదంతా ఓ వైపు. మరోవైపు తన సినిమాల విషయంలో చాలా పక్కాగా ఉంటారని, ఈ క్రమంలో మిగిలిన సినిమాలను అస్సలు పట్టించుకోరు అని అంటారు. ఈ మాట మేం అనడం లేదు. వచ్చే సంక్రాంతి వార్ గురించి తెలిసిన నెటిజన్లు అంటున్నారు.
వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర ఏం జరగబోతోంది అనే మాట చాలా మంది సినీ గోయర్స్ నోట వినిపిస్తోంది. కారణం ఈసారి బాక్సాఫీసు దగ్గర ఆరు సినిమాలు పోటీపడబోతున్నాయి. రెండు పెద్ద సినిమాలు, రెండు చిన్న సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే ఇందులో నాలుగు సినిమాలకు దిల్ రాజు అండదండలు ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చ. ఈజీగా చెప్పాలంటే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ కాకుండా సంక్రాంతికి వస్తాయి అంటున్న సినిమాలకు దిల్ రాజు అండదండా ఉన్నాయట.
దిల్ రాజు సొంత సినిమా ‘వరిసు’ / ‘వారసుడు’ సంక్రాంతికే వస్తోంది. ఎంతమంది ఏమన్నా.. ఆయన మాత్రం సంక్రాంతికి సినిమా తీసుకొచ్చేస్తున్నారు. అంతేకాదు మంచి మంచి థియేటర్లు ఆ సినిమా కోసం హోల్డ్ చేసేశారు అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది. పొరపాటున ఆ సినిమాకు సరైన ఫలితం రాకపోతే.. ఆ థియేటర్లు ఎవరికిస్తారు. అంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఇచ్చి.. మా సినిమా వల్ల కాలేదు.. మీ సినిమా అయినా వేసుకోండి అంటారా? లేక చిన్న సినిమాలకు ఇస్తారా అనేది చర్చ.
ఎందుకంటే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’, ‘వరిసు’ కాకుండా సంక్రాంతి రేసులో బోనీ కపూర్ – అజిత్ ‘తునివు’ వస్తోంది. అలాగే చిన్న సినిమాలు ‘కళ్యాణం కమనీయం’, ‘విద్యా వాసుల అహం’ కూడా వస్తున్నాయి అంటున్నారు. ఈ మూడు సినిమాల నిర్మాతలు దిల్ రాజు బాగా దగ్గర అని అంటున్నారు. ఈ లెక్కన ‘మైత్రీ’ వాళ్ల సినిమాల పరిస్థితి అర్థం కావడం లేదు అని నెటిజన్లు వాపోతున్నారు.