‘ఆచార్య’ (Acharya) సినిమా ఫలితం తేడా కొట్టింది కాబట్టి సరిపోయింది కానీ.. ఆ సినిమా బాగా ఆడి ఉంటే నైజాంలో థియేటర్ల సమస్య మీద చాలా పెద్ద చర్చ జరిగేది. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల సమస్య వస్తోంది అని నైజాం రైట్స్ కొనుక్కున్న వరంగల్ శ్రీను చాలా బాధపడ్డారు. అయితే ఫలితం తేడా కొట్టేసరికి థియేటర్ల అవసరం పడలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మరోసారి చిరంజీవి (Chiranjeevi) సినిమాకు వస్తుందా?
ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ప్రస్తుతం నైజాం రైట్స్ విషయంలో జరుగుతున్న పంచాయితీ తెలియాలి. కార్తికేయ గుమ్మకొండ (Kartikeya) ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) అనే ఓ సినిమా చేసింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ టీమ్ రిలీజ్ చేస్తోంది. దీంతో థియేటర్ల విషయంలో ఇబ్బంది రాకుండా అన్ని ప్లాన్స్ వేసుకుంటున్నారట.
యూవీ అధినేతలు వంశీ – విక్కీ- ప్రమోద్.. తమ పాత స్నేహితుల్ని కాదని ఈ సినిమా మైత్రీ వాళ్లకు ఇచ్చారు. వాళ్లేమో ఆ పాత ‘స్నేహితులు’కు పోటీగా డిస్ట్రీబ్యూషన్ రన్ చేస్తున్నారు. దీంతో నైజాంలో అనుకున్న స్థాయిలో థియేటర్లు యూవీకి దొరుకుతాయా అనేదే ప్రశ్న. అంతేకాదు ఈ ఎఫెక్ట్ యూవీ తర్వాత సినిమా ‘విశ్వంభర’కు (Vishwambhara) కూడా వస్తుంది అని ఓ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా కూడా మైత్రీ వాళ్లే హ్యాండిల్ చేస్తారట.
‘భజే వాయువేగం’ సినిమాకు ఎక్కువ థియేటర్లు అవసరం లేకపోవచ్చు. దీంతో థియేటర్ల సమస్య అంతగా రాదు. కానీ ‘విశ్వంభర’ దగ్గరకు వచ్చేసరికి థియేటర్లు చాలా పెద్ద సమస్య. అందులోనూ సంక్రాంతికి ఆ సినిమాను తీసుకొచ్చే ప్లాన్స్‌లో ఉన్నారు. కాబట్టి ఇంకా పెద్ద సమస్య. చూడాలి మరి ఆ సీనియర్ బ్రదర్స్ విషయంలో యూవీ – మైత్రీ ఎలా ముందుకు వెళ్తారో? గతంలో ‘ఆచార్య’కు జరిగిన విషయాలు వీళ్లు గుర్తుంచుకుంటే ఇంకా బాగా హ్యాండిల్ చేయొచ్చు.