సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయాలని ఏ నిర్మాతకు ఉండదు చెప్పండి. అలాగే చెప్పిన డేట్‌కి అంతా రెడీ చేయాలని ఏ దర్శకుడుకి అనిపించదు చెప్పండి. అలాగే హీరోలు కూడా తమ ఫ్యాన్స్‌కి చెప్పిన సమయానికి ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇవ్వాలని అనుకుంటారు. అయితే ఇవన్నీ జరగాలంటే.. సమయానికి ఫైనల్ కాపీ రెడీ అవ్వాలి. అయితే ఇప్పుడు సంక్రాంతి సినిమాల విషయంలో ఇదే సమస్య అని అంటున్నారు. అవును సంక్రాంతికి రాబోయే నాలుగు పెద్ద సినిమాల్లో మూడు సినిమాల ఫైనల్ కాపీ ఇంకా రెడీ అవ్వలేదట.
సంక్రాంతి సినిమాల విడుదల మొదలవ్వడానికి ఇంకా గట్టిగా చూస్తే వారం కూడా లేదు. ఇంకా ఓ సినిమాకు రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒకపక్క ‘వరిసు’ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ చేస్తూనే మరోపక్క ‘వీర సింహారెడ్డి’ సినిమా పనులూ చేస్తున్నారట తమన్. దీంతో ఆ రెండు పడవల ప్రయాణం ఎఫెక్ట్ రెండు సినిమాల మీద కూడా పడుతోంది అని చెబుతున్నారు. రీరికార్డింగ్ అయ్యాక, మిక్సింగ్ చేసి క్యూబ్‌కి ఇవ్వాలి.
అక్కడ అప్‌లోడింగ్ పూర్తయితేనే ఆ సినిమాను విడుదల చేయగలుగుతారు. దానికితోడు విదేశాల్లో పండగ సినిమాలను ఒక రోజు ముందే ప్రీమియర్లు వేస్తున్నారు. దీంతో 11వ తేదీకే అంతా రెడీ అయిపోవాలి. ఈ క్రమంలో మరి తమన్ ఎలా చేస్తారు, సినిమా సమయానికి రెడీ అవుతుందా అనే టెన్షన్‌లో టీమ్ ఉందంటున్నారు. ఫైనల్ కాపీ రెడీ అయితే సెన్సార్‌కి ఇవ్వాలని చూస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అంతా ఓకే అయిపోతుంది అని అంటున్నారు.
మరోవైపు విజయ్ ‘వరిసు’ / ‘వారసుడు’ సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది అంటున్నారు. సినిమా రిలీజ్ డేట్‌ను 11కి మార్చారు ఇటీవల. అయితే సినిమా నిజంగానే 11కి వచ్చేందుకు ‘వారసుడు’ రెడీ అవుతాడా అనేదీ డౌట్ అంటున్నారు. దీంతో 14వ తేదీకి సినిమా మూవ్ అవ్వొచ్చు అని చెబుతున్నారు. ఈ పుకార్లకు కారణం టీమ్ ఇంకా సినిమా పనుల్లో ఉంది అనే వార్తలు రావడమే. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విషయంలో ఈ ఇబ్బంది లేదు అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి అని టాక్.