ప్రముఖ కథానాయకుడు నాగార్జునకు జోస్యం బాగా తెలుసు అంటారు. అయితే అది సినిమాల జోస్యం మాత్రమే. గతంలో సినిమా ఆడియో ఫంక్షన్లు జరిగినప్పుడు ఈ సినిమా పక్కా హిట్ అని బల్లగుద్ది మరీ చెప్పేవారు. అనుకున్నట్లే ఆ సినిమా ఘనవిజయం సాధించేది. అలా చాలా సినిమాలకు జరిగింది. ఆయన ఆ మాట చెప్పని సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తాకొట్టాయి. అయితే ఆయన తీసుకున్న ఓ నిర్ణయం తాజాగా బెడిసికొట్టింది. అదే ‘వైల్డ్‌డాగ్’. ఇంతకీ ఏమైందంటే…
కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే ‘వైల్డ్‌డాగ్’ చిత్రీకరణ పూర్తయింది. దీంతో సినిమాను ఓటీటీకి ఇవ్వడానికే వేగంగా తీసేశారు అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ డీల్ కూడా కుదిరిపోయింది. ఈలోగా కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమాను ఓటీటీకి ఇచ్చే విషయంలో నాగ్ అండ్ కో నిర్ణయం మార్చుకుని నేరుగా థియేటర్లకు వచ్చారు. తీరా ఇక్కడ సినిమా గాలి తీసేసింది. దీంతో అందరూ నిరాశపడ్డారు. ఆఖరికి నాగార్జున కూడా.
అయితే ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’కు ఓటీటీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కంటిన్యూస్‌గా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో నాగార్జున జోస్యం, నిర్ణయం ఫెయిల్ అయ్యాయని నెటిజన్లు అంటున్నారు. సినిమా ఫలితం మీద బాగా పట్టుండే నాగార్జున ‘వైల్డ్ డాగ్’ విషయంలో ఎందుకిలా చేశారు అనేదే వాళ్ల ఆలోచన. ఏదైతేముంది ఇప్పుడు ఓటీటీలో హిట్ అయ్యింది కదా అనుకోవద్దు. ఇప్పుడు వస్తున్న డబ్బులు కంటే నేరుగా ఓటీటీకి ఇచ్చుంటే ఎక్కువ డబ్బులు వచ్చేవి కదా.