వైజయంతి మూవీస్‌కు చెందిన కొత్త ఆఫీసు ఓపెనింగ్ ఇటీవల ఘనంగా జరిగింది. వాళ్లు ఆలస్యంగా చెప్పుండొచ్చేమో కానీ.. నెటిజన్లకు మాత్రం ఈ విషయం ఆ రోజే అంటే 25నే ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో ప్రభాస్ లుక్ చూసి ఇదేంటి తేడాగా ఉందే అనుకున్నారు, అమితాబ్ బచ్చన్ ఆ ఆఫీసును ఓపెన్ చేయడం చూసి వావ్ అనుకున్నారు. ఓ ఫ్రేమ్‌లో అందరూ కుర్చీల్లో, కౌచ్‌ల్లో కూర్చుంటే దర్శకుడు నాగ్ అశ్విన్ నేలపై కూర్చోవడం చూసి.. వాటే సింప్లిసిటీ అనుకున్నారు. అయితే ఓ వ్యక్తిని చూసి ‘ఇతనెందుకు వచ్చాడబ్బా?’ అనుకున్నారు.
అతనెవరో కాదు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ ఈవెంట్‌కి వచ్చినవాళ్లను చూస్తే వైజయంతి మూవీస్‌కి లేదంటే స్వప్న సినిమాస్‌కి దగ్గర అనుబంధం ఉన్నవాళ్లే. రాఘవేంద్రరావు, అమితాబ్ బచ్చన్, ఆదిశేషగిరిరావు, నాని, ప్రభాస్.. ఇలా వచ్చినవాళ్లంతా ఆ సంస్థలో సినిమాలు చేస్తుండటమో, లేదంటే గతంలో చేయడమో జరిగాయి. లేదంటే కుటుంబ సన్నిహితులు అయి ఉన్నారు. కానీ ప్రశాంత్ నీల్ వీటిలో దేనికిందకీ రారు. ఎందుకంటే వైజయంతి మూవీస్‌లో ఆయనకు ఇప్పుడు సినిమా లేదు, కొత్తగా చేస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ కూడా లేదు.
ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమాలు అంటే… మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎన్టీఆర్‌తో చేస్తారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా ఉండొచ్చు అని టాక్. అయితే అది ఇంకా కన్‌ఫామ్ కాలేదు. ఉన్నా అది డీవీవీ దానయ్య నిర్మాణంలో ఉండొచ్చు అంటున్నారు. మరి వైజయంతి మూవీస్ కార్యాలయం ఓపెనింగ్‌కి ప్రశాంత్ నీల్ ఎందుకొచ్చినట్లు అనేదే ప్రశ్న. అయితే ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం మూలంగా ప్రశాంత్ అక్కడికి వచ్చారు అని చెబుతున్నారు.
ఒకవేళ అందరూ అనుకున్నట్లుగా ప్రశాంత్ నీల్‌తో వైజయంతి మూవీస్ సినిమా చేయాలి అంటే.. హీరో ఎవరు అనేది ఆలోచించాలి. ‘సలార్’ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత ‘కేజీయఫ్ 3’ ఉంటుంది. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ తెలుగుకి వస్తారు. అప్పట్లో వైజయంతి టీమ్ హీరోను రెడీ చేస్తుందేమో. ఆ మధ్య ప్రశాంత్ నీల్ – నాని సినిమా ఉండొచ్చు అని ఓ టాక్ వినిపించింది. ఆ సినిమా సందర్భంగా ఏమన్నా ప్రశాంత్ వచ్చి ఉండొచ్చా?