దేవిశ్రీప్రసాద్ వర్సెస్ తమన్.. ఇది ఇప్పటి పోరు కాదు. చాలా ఏళ్ల నుండి ఉంది. అయితే ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం తగ్గాక ఆ పోరు కనిపించకుండా పోయింది. తమన్ వరుస విజయాలు అందుకోవడంలో బిజీగా ఉంటే.. దేవిశ్రీప్రసాద్ వరుస సినిమాలు చేయడంలో వెనుకబడ్డాడు. అయితే చాలా రోజులకు ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. అవే ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’. దీంతో సంక్రాంతికి మోత మోగించేది ఎవరు అంటూ ఓ చర్చ మొదలైంది టాలీవుడ్‌లో.
బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’కు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ‘వీర సింహా రెడ్డి’ సినిమా విషయంలో ‘అందిస్తున్న’ అని ఎందుకు అన్నామో ఆఖరున చెబుతాం. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సీజన్‌కిగాను విడుదల అవుతున్నాయి. బాలయ్య జనవరి 12న వస్తుంటే, చిరంజీవి జనవరి 13న వస్తున్నాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య పోటీతోపాటు.. తమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య కూడా పోటీ అని అంటున్నారు.
తమన్, డీఎస్పీలో ఎవరు ఎక్కువ అని అంటే.. దీనికి లెక్క చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎవరికి వారే తమ సంగీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. తమన్‌కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యూఎస్‌పీ అయితే, డీఎస్పీకి ఊపునిచ్చే పాటలు యూఎస్‌పీ. ఇప్పుడు సంక్రాంతి వార్ కూడా ఆ రెండింటి మధ్యే నడుస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ పాటల విషయంలో అంతగా స్పందన లేదని చెప్పొచ్చు.
దీంతో సినిమా విడుదలైతేనే అసలు విషయం తేలుతుంది అని అంటున్నారు నెటిజన్లు. ‘పుష్ప’ సినిమా బ్యాగ్రౌండ్ స్కోరు విషయంలో కాస్త డౌన్ అయ్యిందనే చెప్పాలి. దీంతో ‘వాల్తేరు వీరయ్య’కు దేవి ఎలాంటి ఆర్‌ఆర్ ఇచ్చాడో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఆ విషయంలో తమన్ ఏ మాత్రం తగ్గేది లేదు. కాబట్టి రాబోయే సంక్రాంతికి ఎవరి మోత అదిరిపోతుంది, ఎవరు హీరో అవుతారు అనేది ఆసక్తికరం.