ఒక సినిమాను రెండు నిర్మాణ సంస్థలు నిర్మించడం కొత్తేమీ కాదు. అయితే ఇద్దరు నిర్మాతలు ఉండరు. ఒకరు సమర్పణ అయితే, మరొకరు నిర్మాత. అయితే ఈ పేర్లు చెప్పడం వెనుక పెద్ద లెక్క, లాజిక్కే ఉంటుంది అంటుంటారు. ఇవన్నీ పక్కనపెడితే.. ఇలా రెండు పేర్లతో తెరకెక్కుతున్న ఓ సినిమా పోస్టర్‌లో ఓ నిర్మాణ సంస్థ పేరు మాయమైంది. దీంతో మొన్నటివరకు ఉన్న పేరు ఇప్పుడెందుకు మాయమైంది అంటూ లెక్కలేస్తున్నారు జనాలు. ఆ మిస్ అయిన పోస్టర్ ‘భోళా శంకర్’.
అవును, చిరంజీవి సినిమా గురించే ఈ చర్చంతా.(Bhola Shankar) ‘భోళాశంకర్’ సినిమాను చిరంజీవి ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద చేయాలి. ఈ మేరకు సినిమా స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతుండగా కేఎస్ రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్ అనే నిర్మాణ సంస్థ పేరు వచ్చి యాడ్ అయ్యింది. చాలా రోజులుగా పెద్ద సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న సీసీ ఇప్పుడు ఎందుకు వచ్చిందో అనే ప్రశ్నలు వినిపించాయి. దానికి అప్పుడు ఆన్సర్ లేదు. అయితే తాజాగా ఆ సినిమా పోస్టర్‌లో పేరు లేదు. దీంతో మళ్లీ ప్రశ్నలు వచ్చాయి.
అయితే ఈ సారి ప్రొడక్షన్ హౌస్ సన్నిహితుల నుండి చిన్న పాటి సమాధానం అయితే వచ్చింది. నిజానికి ఈ సినిమా రెండు నిర్మాణ సంస్థల ద్వారానే తీసుకురావాలని అనుకున్నారట. అయితే ఈ ఏడాది క్రియేటివ్ కమర్షియల్స్‌కు చాలా ప్రతిష్ఠాత్మకం. ఈ బ్యానర్ పెట్టి 50 ఏళ్లు అయ్యింది. సినిమాల్లోకి వచ్చి అయితే 40 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ ఏడాది వేరే బ్యానర్‌తో కలసి సినిమా ఎందుకు? నేరుగా చిరంజీవితో ఈ ఏడాది సినిమా చేసి 50వ సంవత్సరాన్ని స్పెషల్ చేసుకుందామని అనుకున్నారట.
దీంతోనే పోస్టర్‌లో పేరు మాయమైంది అంటున్నారు. చిరంజీవి, క్రియేటివ్ కమర్షియల్స్ కలయికలో ఇప్పటివరకు ఐదు సినిమాలొచ్చాయి. ఆఖరిగా 1991లో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చేశారు. ఇప్పుడు చేస్తే 22 ఏళ్ల తర్వాత చేసినట్లు అవుతుంది. మరి ఏ సినిమా ప్రకటిస్తారు అనేది చూడాలి.