‘గాడ్ ఫాదర్’ సినిమా విషయంలో చిరంజీవి అభిమానులు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బలంగా రాసుకొస్తున్నారు. సినిమా ప్రచారం సరిగ్గా లేదంటూ.. గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ చిత్రబృందం నుండి ఎలాంటి స్పందన ఉండటం లేదు. పట్టుమని 20 రోజులు లేదు సినిమా విడుదలకు అయినప్పటికీ సినిమా ప్రచారం కాస్త కూడా జోరందుకులేదు. ఇదొక్కటే కాదు సినిమా పంపిణీ విషయంలోనూ చిత్రబృందం బాగా స్లోగా ఉందని చెబుతున్నారు.
మూమూలుగా అగ్ర హీరో సినిమాలను ఓన్ రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఏరియాల వారీగా అమ్మేస్తుంటారు. కొన్ని చోట్లు థియేటర్లకు టై అప్ అయ్యి విడుదల చేస్తుంటారు. చిరంజీవి సినిమాలు కూడా ఇలానే విడుదలవుతూ ఉంటాయి. కానీ ‘గాడ్ ఫాదర్’ విషయంలో మొత్తం లెక్క మారుతోంది. సినిమాను ఏరియాల వారీగా అమ్మేయకుండా… అడ్వాన్స్‌లు తీసుకొని విడుదల చేయమని చిరంజీవి సూచించారని తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమాకు నిర్మాతలు ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు కాగా, కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో సినిమా తెరకెక్కింది.
ఇంత పెద్ద బ్యానర్లు, పెద్ద హీరో సినిమా అడ్వాన్స్‌ల మీద విడుదల చేయడం ఏంటి? అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్‌లో కనిపిస్తోంది. ఓవర్ సీస్‌లోనూ ఇదే పరిస్థితి అంటున్నారు. దీంతోనే సినిమా మీద టీమ్‌కి నమ్మకం లేదా? ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే గత చిత్రం ‘ఆచార్య’ ఫలితం చూసి.. ఇలా చిరంజీవి జాగ్రత్త పడుతున్నారు అనే మాటలూ వినిపిస్తున్నాయి. ‘ఆచార్య’ సినిమాను భారీ ధరలకు అమ్మేశారు.
సినిమా దారుణ పరాజయం పాలవ్వడంతో ఎక్కడికక్కడ థియేటర్లు, పంపిణీదారులకు లాస్ వచ్చింది. దీంతో ఈసారి ఏదైనా ఇబ్బంది వస్తే కష్టమని ముందు జాగ్రత్తగా చిరంజీవి అండ్ కో. ఇలా చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇదేదో అతి జాగ్రత్తలా ఉంది అనేవాళ్లూ ఉన్నారు. సరైన ప్రచారం లేకుండా అభిమానులు ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడు సినిమా విడుదల విషయంలో ఇలాంటి వార్తలు రావడం ఇంకా ఇబ్బందిగా ఉంది. మరి చిరంజీవి ఈ విషయంలో ఏమైనా ఆలోచన మార్చుకుంటారేమో చూడాలి.