నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో ఉత్తమ నటుడి పురస్కారాన్ని ఇద్దరి ప్రకటించారు. అందులో ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమాకుగాను విక్రాంత్ మసే, ‘జవాన్’ సినిమాకుగాను షారుఖ్ ఖాన్‌కి పురస్కారం ప్రకటించారు. మొదటి హీరో విషయంలో పెద్దగా రాని విమర్శలు.. రెండో హీరో విషయంలో వస్తున్నాయి. ఇలాంటి అవార్డుల విషయంలో విమర్శలు రావడం పెద్ద విషయం కాదు, కొత్త విషయమూ కాదు. అయితే షారుఖ్‌కి అవార్డు సరికాదంటూ చెబుతున్న కారణాలే విచిత్రంగా ఉన్నాయి.
Shah Rukh Khan
‘జవాన్’ సినిమా నేపథ్యంలో, అందులో హీరో పాత్ర చిత్రణ, సినిమా జోనర్.. ఇలా చాలా అంశాల గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. ఇలా ప్రస్తావించేవారిలో కొంతమంది టాలీవుడ్ ఫ్యాన్స్, సౌత్ సినిమాల ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో గతం మరచిపోయి, రీసెంట్ సినిమాలకు వచ్చిన పురస్కారాలను మరచిపోయి ఇప్పుడు షారుఖ్ ఖాన్‌ని విమర్శిస్తున్నారా అనే రిప్లైలు కూడా కనిపిస్తున్నాయి. కచ్చితంగా ఈ విషయాన్ని అందరూ పట్టించుకునే విమర్శలు చేయాల్సిన పరిస్థితి.
‘జవాన్’ సినిమా కచ్చితంగా కమర్షియల్ సినిమానే. కానీ ఆజాద్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ బాద్‌షా అదరగొట్టాడు. పాత్ర కోసం చాలా తగ్గాడు. ఈ క్రమంలో జ్యూరీకి నచ్చి అవార్డు ఇచ్చారు. అయితే కమర్షియల్ సినిమాకు అవార్డా అని కొందరు గింజుకుంటున్నారు. అలా అయితే గతేడాది ‘పుష్ప’ సినిమాకు గాను అల్లు అర్జున్‌కి ఇలానే జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చారు. కాస్త నెగిటివ్ టచ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే హీరో పాత్ర చేసినందుకుగాను అల్లు అర్జున్‌కి అవార్డు ఇస్తే.. షారుఖ్‌కి ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు.
బన్నీకి ఇచ్చినప్పుడు నటనను చూడాలి, పాత్ర స్వభావం కాదు, అందులోని మంచి చెడ్డలు కావు అని అన్నారు కొంతమంది. మరిప్పుడు షారుఖ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా అంటున్నారో వారికే తెలియాలి. అవార్డు అదే, అందుకున్న / అందుకోనున్న హీరో మారితే రూల్స్ మారవు కదా. అదన్నమాట మేటర్.