సినిమా విడుదలకు ముందు జరిగే ప్రచారంలో తమ నటన గురించి, దర్శకుడి గురించి నటులు బాగా మాట్లాడారు. సినిమా కోసం తాము పడ్డ కష్టం గురించి చెబుతూ.. టెక్నికల్ టీమ్ చేసిన పని గురించి చెబుతారు. లేదంటే సినిమా విడుదలైన వెంటనే ఓ థ్యాంక్స్ మీట్ లాంటిది పెట్టి మాట్లాడతారు. కానీ సినిమా వచ్చిన చాలా రోజులకు, అందులోనూ వచ్చి డిజాస్టర్ టాక్ అందుకున్న సినిమా గురించి ఓ హీరో ఇప్పుడు గొప్పగా మాట్లాడాడు అంటే ఏదో విషయం ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ పని చేసింది ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక రోషన్.
మామూలుగా అయితే హృతిక్ ఇప్పుడు తన సినిమా గురించి గొప్పగా చెప్పుకొని ఉంటే మనకు పెద్ద విషయం కాదు. అయితే ఆయన చెప్పిన సినిమా మనకు బాగా కనెక్ట్ ఉన్న ‘వార్ 2’ సినిమా గురించింది. తారక్ ప్రేక్షకులు ఆ సినిమా పేరు ఎత్తితే ఒంటి కాలి మీద లేచేంత కోపంగా ఉన్నారు. సినిమాలో తారక్‌ను చూపించిన విధానం, సినిమా ఫలితమే దీనికి కారణం. ఆ సినిమాను ఇప్పుడిప్పుడే మరచిపోయి ‘డ్రాగన్’ (ప్రశాంత్ నీల్ సినిమా రూమర్డ్ టైటిల్) ఊహల్లో ఆనందంగా ఉన్నారు. అయితే హృతిక్ మరోసారి ఆ సినిమాను గుర్తు చేశాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ నాట్ హ్యాపీ.
‘వార్ 2’ సినిమా గురించి హృతిక్ ఓ పెద్ద సోషల్ మీడియా పోస్టు చేశారు. కబీర్ పాత్రను సరదాగా పూర్తి చేశాను. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి సులభంగా అనిపించింది. ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే.. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోండి. ఒక నటుడిగా మీ బాధ్యతను 100 శాతం చేయండి. మీ పని మీరు చేసి ఇంటికి రండి. ‘వార్ 2’ సినిమా విషయంలో నేను అదే చేశాను. షూటింగ్ జరిగినన్ని రోజులూ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎనర్జీ మాలో ఉత్సాహం పెంచింది అని పోస్టులో రాశాడు హృతిక్.
అయితే, ఇక్కడ ప్రశ్న అసలు హృతిక్ ఇప్పుడెందుకు ఈ సినిమా గురించి పోస్టు పెట్టాడని. అయితే దానికి అర్థం సినిమా ఓటీటీ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది అని. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాను అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తారని టాక్. అంఉదకే కాస్త హైప్ ఇద్దామని హృతిక్ ఈ పోస్టు పెట్టాడంటున్నారు. కానీ రియాక్షన్స్ చూస్తే ప్రయత్నం మిస్ ఫైర్ అయింది అనిపిస్తోంది.