Irumudi: రవితేజను పాన్ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్.. ఆ ప్లాన్ చేయలేదెందుకో?
- January 27, 2026 / 11:17 AM ISTByFilmy Focus Desk
ఎన్ని పరాజయాలు ఎదురవుతున్నా మాస్, యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్న మాస్ మహారాజ రవితేజ.. మొన్న సంక్రాంతికి పూర్తిగా ఫ్యామిలీ జోన్‌లోకి వచ్చేశాడు. అలా అయినా అనుకున్న విజయం దక్కిందా అంటే ఆల్మోస్ట్ మంచి విజయం అందుకున్నట్లే. హీరో ఫామ్‌లో లేకపోవడం వల్లనో, లేక సినిమా ప్రచారం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లనో కానీ రవితేజ స్థాయి వసూళ్లు రాలేదు. దీంతో మళ్లీ తిరిగి యాక్షన్ జోన్‌లోకి వచ్చేస్తాడేమో అనుకుంటే ‘ఇరుముడి’ అంటూ డివోషనల్ టచ్ ఉన్న సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు.
Irumudi
‘ఇరుముడి’ అని పేరు పెట్టి సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇందులో ఎలాంటి మాస్ ఎలివేషన్లు, యాక్షన్ టచ్‌లు, ఓవర్ కామెడీ లాంటివి చూపించడం అసాధ్యం. కుటుంబం బంధాలు, బాంధవ్యాలు, దేవుడు, భక్తి, శబరిమల ప్రయాణం ఇలాంటి కాన్సెప్ట్‌లే ఉంటాయి. ఇంతకుమించి కాస్త అటు ఇటు వెళ్తే మనోభావాలు బ్యాచ్ బయటకు వచ్చేస్తారు. అంటే ఈ లెక్కన ఇది చాలా రిస్కీ సబ్జెక్ట్. కానీ రవితేజ ధైర్యంగానే ఎంచుకున్నారు. దర్శకుడు శివ నిర్వాణ కూడా ధైర్యంగానే చేస్తున్నారు.
అయితే, ఇక్కడే ఒక డౌట్. సినిమాలో సత్తా లేకపోయినా, ఒకట్రెండు సీన్లు, ఎలివేషన్లు పట్టుకుని అక్కడ కొన్ని సీన్లు పెట్టి పాన్ ఇండియా సినిమా అని ఊదరగొడుతున్న ఈ రోజుల్లో ఈ సినిమాలో పాన్ ఇండియా లేదంటే సౌత్ మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తీయగల సత్తా ఉంది. అయినా ఎందుకో మరి రవితేజ కానీ, మైత్రీ మూవీ మేకర్స్ కానీ, దర్శకులు శివ నిర్వాణ కానీ ఆ ఆలోచన చేయలేదు. ఎందుకంటే శబరిమల అయ్యప్పస్వామి సౌత్ వాళ్లందరికీ బాగా కనెక్ట్ అయ్యే దేవుడు.
ఆయన నేపథ్యంలో రూపొందుతున్న సినిమాను కేవలం తెలుగు వరకు పరిమితం చేయడం ఏంటి? రవితేజ మార్కెట్ మీద నమ్మకం లేకనా? లేక ఇంకేదైనా ఆలోచన ఉందా అనేది సినిమా టీమ్‌కే తెలియాలి. ఏదైతేనేం రవితేజ మూసధోరణిలో ఉండిపోయాడు అనేవారికి ఈ సినిమా ఒక మేలుకొలుపు.















