ఓ పెద్ద గీతను చిన్న గీతగా మార్చాలంటే… దాని పక్కన ఇంకా పెద్ద గీత గీయాలి!
– మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్న ఓ అనధికారిక సూత్రం ఇది. దీనిని ప్రజలు ఎంతగా పాటిస్తున్నారో తెలియదు కానీ… కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమకు, తమవారికి అవసరమైనప్పుడల్లా ఇదే పని చేశాయి, చేస్తున్నాయి, చేస్తూనే ఉంటాయి. అయితే దీనికి చిన్న యాడింగ్ ఏంటి అంటే… అసలు గీత పక్కన గీసేది నిజానికి పెద్ద గీత కాదు… పెద్దది అని ప్రజల్ని నమ్మిస్తుంటారు అంతే. దీనికి తాజా ఉదాహరణ తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు ఘటనలు. అవేంటో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఫాలో కానివారికి తెలియాలి కాబట్టి చెబుతున్నాం. అవి చదివాక, మేం చెప్పింది మీకు అర్థమయ్యాక… ఆ మీడియా సంస్థలు మనల్ని మరీ కళ్లున్న కబోదుల్ని చేస్తున్నాయా? అనిపించకపోతే ఒట్టు.
ఈ నెల 10వ తేదీ ఉదయం వచ్చిన వార్త…
ఆరేళ్ల చిన్నారిని ఓ యువకుడు అతిదారుణంగా అత్యాచారం చేసి హతమార్చాడు అనే వార్త వచ్చింది. వచ్చీ రాగానే మీడియా ఈ వార్తను హైలైట్ చేశాయి. నగరంలో ఇలాంటి ఘటనా అంటూ ఎంత వేగంగా వార్తలు ఇచ్చాయో, మధ్యాహ్నానికి అంతే వేగంగా జోరు తగ్గించాయి.
అదే రోజు రాత్రి 9 గంటలకు వచ్చిన వార్త…
34 ఏళ్ల కుర్రాడు ఒకరు రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అతను టాలీవుడ్ యువ హీరో అనేది ఇక్కడ పాయింట్. దీంతో ఎప్పటిలాగే మీడియా ఆ వార్తను కవర్ చేసింది. ఒకటి రెండు ఛానళ్లు అయితే ఆ విషయం మేం ఆ కుటుంబానికి చెప్పాం అంటూ భుజాలు చరుచుకున్నాయి కూడా.
రెండింటి ఏది ఇంపార్టెంట్ అంటే… వార్తగా చూస్తే రెండూ ఇంపార్టెంటే. కానీ కొన్ని తెలుగు మీడియా ఛానల్స్‌కు రెండో సంఘటన మాత్రమే ఇంపార్టెంట్ అనిపించిందో ఏమో. తెలుగు రాష్ట్రాల్లో ఆ యాక్సిడెంట్ కాకుండా ఇంకేమీ జరగలేదు అన్నట్లు వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలు, డెమోలు, నిపుణుల అభిప్రాయాలు… ఇలా ఒక్కటేంటి జర్నలిజం ఉన్నవి, లేనివీ అన్నీ తెచ్చి హైలైట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో జరిగినవి, జరగనవి అన్నీ పోగేసి చెప్పారు అనేది వేరే కాన్సెప్ట్. దాని గురించి తర్వాత మాట్లాడదాం.
దిల్లీలో నిర్భయ, మన దగ్గర దిశ ఘటనలు గుర్తున్నాయా? ఎందుకు మరచిపోతాం. మానవజాతి మొత్తం ఏకతాటిపై నిలిచి నిందితులకు శిక్ష పడాలి అని నినదించింది. ఆ తర్వాత కూడా ఒకటి రెండు విషయాల్లోనూ ఇలానే జరిగింది. మీడియా కూడా అంతే స్థాయిలో ఉద్యమం చేసింది. అలాంటి కొన్ని మీడియా సంస్థలకు ఆరేళ్ల చిన్నారికి జరిగిన హత్యాచారం, ఆ కుటుంబం కడుపుకోత కనిపించలేదా? కనిపించినా… ‘గజనీ’లాగా కాసేపటికి మరచిపోయిందా?
సాయిధరమ్ తేజ్ సంఘటన విషయంలో… అంతలా వెంపర్లాడిన (దేని కోసం నెటిజన్లు ఏకి పారేస్తున్నారు అనుకోండి) కొన్ని మీడియా సంస్థలు సామాన్య కుటుంబం కష్టాన్ని, ప్రజల ఆందోళనను కవర్ చేసే సమయం లేదా. ఎక్కడో ఆఫ్గానిస్థాన్‌లో పిల్లల పట్ల జరుగుతున్న దాడులు, పొరపాటున బండి స్కిడ్ అయి పడిపోయిన హీరో కనిపిస్తున్నాడు కానీ… ఆరేళ్ల చిన్నారి, ఆమె కుటుంబం కనిపించలేదా? ఈ మాటలు మేం అంటున్నవి కావు. సోషల్ మీడియాలో అలా ఓ లుక్ వేస్తే ఇలా కనిపిస్తాయి.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!