సినిమా సెలబ్రిటీలయందు నాగ్ అశ్విన్ (Nag Ashwin) వేరయా అని అంటుంటారు టాలీవుడ్‌లో. ఎందుకంటే ఆయన నటవడిక చాలా సాధారణంగా ఉంటుంది. హవాయి చెప్పులు, బ్యాటరీ కార్లు.. ఇలా చాలా సాదాసీదాగా ఉంటారాయన. అలాంటాయన తన కుటుంబంతో కలసి తిరుమల వెళ్లారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. అలా తిరుమల వెదర్ గురించి, ‘కల్కి 2’ సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘ఎవడే సుబ్రమణ్యం’(Yevade Subramanyam) సినిమాతో మనసుల్ని మెలితిప్పే దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగ్ అశ్విన్ ఆ తర్వాత ‘మహానటి’ (Mahanati) సినిమాతో తనేంటో నిరూపించుకున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అంటూ ప్రభాస్‌తో (Prabhas) ఓ సినిమా చేసి తనేంటో ప్రపంచ సినిమాకు చూపించారు. అలాంటి ఆయన సగటు బిడ్డలా తండ్రి వెనుక ఓ బ్యాగు వేసుకొని తిరుమల వెళ్లాడు. సగటు సినిమాల సెలబ్రిటీల నుండి మనం ఇలాంటివి తక్కువగా చూస్తూ ఉంటాం. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నాగ్ అశ్విన్ గురించి ఇప్పటికే తెలుసున్న వాళ్లు ఆయన అలా సాధారణంగా ఉండటం పెద్ద విషయం కాదు అని అనుకుంటుంటే.. తెలియనివాళ్లేమో ఈయన రూ. వెయ్యి కోట్ల దర్శకుడు అనే విషయం మరచిపోయినట్లున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో నాగ్ అశ్విన్ గురించి ఆయనకు పిల్లనిచ్చిన మామ, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (C. Aswani Dutt)కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన సినిమాల గురించే ఆలోచిస్తూ ఉంటారని, ఒక్కోసారి వాళ్ల నాన్న చెప్పులేసుకొని మా ఇంటికొచ్చి.. మా ఇంటి నుండి చెప్పులేసుకొని వెళ్లిపోతాడు అని చెప్పారు.
ఇక అసలు విషయానికొస్తే.. నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. సినిమా మొదలవ్వడానికి చాలా సమయం పడుతుంది అని, ఇంకా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే నిర్మాతలు మాత్రం సినిమా త్వరలో ప్రారంభం అవ్వొచ్చు అని ఆ మధ్య అన్నారు. చూడాలి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో?