ఒక్కోసారి హీరో మీద లేదా నిర్మాణ సంస్థ మీద ఉన్న కోపాన్ని సినిమాపై ప్రొజెక్ట్ చేస్తుంటారు జనాలు. అలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ కోపానికి అసలు కారణం ఏమిటి అనేదానికి సమాధానం వాళ్ళ దగ్గర కూడా ఉండదు. కానీ.. అదేపనిగా నెగిటివ్ కామెంట్ చేయడం మాత్రం తమకు తెలియకుండానే చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు “సరిలేరు నీకెవ్వరు” సినిమా విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. మహేశ్ బాబు-రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పట్నుంచి సినిమాను రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు కొందరు.
ప్రతి సోమవారం విడుదలవుతున్న పాటలపై కూడా ఎక్కడలేని నెగిటివిటీ వినిపిస్తోంది. నిజానికి దేవిశ్రీప్రసాద్ ప్రీవియస్ ఆల్బమ్స్ తో కంపేర్ చేస్తే “మైండ్ బ్లాక్.. సూర్యుడివో చంద్రుడివో” పాటలు చాలా బెటర్. కాకపోతే.. “సూర్యుడివో చంద్రుడివో” పాటకు బాలీవుడ్ సింగర్ ప్రాక్ వాయిస్ అంతగా సెట్ అవ్వలేదు తప్పితే బాణీ పరంగా కానీ.. సాహిత్యం పరంగా కానీ పాట చాలా బాగుంది. కానీ.. సినిమాను ట్రోల్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో బాగున్న పాటల్ని కూడా ట్రోల్ చేసేస్తూ గొడవ చేస్తున్నారు. మరి ఈ ఆన్లైన్ విద్వేషాలు సినిమాల రిజల్ట్స్ ను ఏమాత్రం ఎఫెక్ట్ చేస్తాయి అనేది చూడాలి.