తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల వ్యవహారంలో ఏపీసీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచం మొత్తం సంచలనం సృష్టించింది. సగటు తెలుగు వ్యక్తి మనసు తల్లడిల్లిపోయింది అని చెప్పాలి. అయితే ఈ విషయం టాలీవుడ్‌లో ఎవరికీ తెలియదా? ఈ డౌట్ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా? కావాలంటే మీరే చూడండి టాలీవుడ్‌లో ఎంతమంది ఈ విషయంలో స్పందించారు.
ఈ ప్రశ్న మొన్నీమధ్య నిర్మాత నట్టి కుమార్ అడిగారు కూడా. ఆయన అడిగారని కాదు కానీ.. అసలు ఎందుకు టాలీవుడ్ ఈ విషయంలో స్పందించడం లేదు. ఏపీ ప్రభుత్వం నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమ లాభపడింది అంటే ఇటీవల కాలంలో అది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పాలి. అలాంటి చంద్రబాబును ఓ వ్యవహారంలో అరెస్టు చేసి, జైల్లో పెడితే కనీసం ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చేలా టాలీవుడ్ నుండి ఒక్కరూ మాట్లాడలేదు అనేదే అర్థం కావడం లేదు.
హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమకు అవసరమైన చాలా పనులు, టికెట్ ధరలు, పర్మిషన్లు.. ఇలా చాలా విషయాలు చంద్రబాబు ద్వారా సినిమా పరిశ్రమలో పెద్దలు చేయించుకున్నారు. వీళ్లు, వాళ్లు అని కాకుండా ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు అనిపించుకున్న అందరూ చేయించుకున్నారు. ఎక్కువగా లబ్ధి పొందని వాళ్ల లెక్క కూడా భారీగానే ఉంది. ఇందులో ఆయన కుటుంబ వ్యాపారాల్లో భాగస్వాములు కూడా ఉన్నారు. ఆ మాటకొస్తే కుటుంబ సభ్యులే ఉన్నారు. పేర్ల ప్రస్తావన ఎందుకు తేవడం లేదు అంటే.. మొత్తం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం.
ఇప్పటివరకు సినిమా పరిశ్రమ నుండి స్పందించిన వారెవరు అనేది చూస్తే.. పవన్ కల్యాణ్, రాఘవేంద్రావు, అశ్వనీదత్ మాత్రమే. మిగిలిన వాళ్లు ఇన్‌డైరెక్ట్ మద్దతు చెప్పి ఉండొచ్చు. కానీ పరిశ్రమ కోసం ఎంతో చేసిన చంద్రబాబుకు (Chandrababu) నేరుగా మద్దతు తెలిపితే కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు వచ్చే మనోధైర్యం ఇంకెప్పుడూ రాదు. మరి ఈ విషయంలో ఎప్పటికైనా సినిమా వాళ్ల మనసు మారుతుందేమో అని టీడీపీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. చూద్దాం ఎంతవరకు, ఎవరు ముందుకొస్తారో?