ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్‌కి దొరికిన మరో పెద్ద డైరెక్టర్ అనుకున్నారంతా. దానికి కారణం ఆయన ఎంచుకునే స్క్రిప్ట్‌లు, రాసుకునే స్క్రీన్ ప్లే. మన దగ్గర అగ్ర దర్శకులు అనిపించుకున్న ఎంతో మంది తొలినాళ్లలో తీయని కథలను, సినిమాలను ఈయన తలకెత్తుకున్నారు. అంతేకాదు వాటికి చక్కటి న్యాయం కూడా చేశారు. అందుకు ఉదాహరణే ‘ఆ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’, ‘హను – మాన్’. అదేంటి గతేడాది వచ్చిన సినిమాతో ఆపేశారు అనుకుంటున్నారా? ఆయన కూడా అక్కడితోనే ఆగిపోయారు కాబట్టి. ఇప్పుడు చర్చ కూడా అదే.
కావాలంటే మీరే చూడండి.. ‘హను – మాన్’ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలు అనౌన్స్ చేశారు. అందులో కొన్ని కథా రచయితగా అయితే, మరికొన్ని దర్శకుడిగా. అయితే అందులో వచ్చిన ఒక సినిమా ఇబ్బందికర ఫలితం అందుకుంటే.. మరికొన్ని సినిమాలు ఏమయ్యాయో కూడా అర్థం కావడం లేదు. అంటే సినిమా ముందుకెళ్తోందా? ఆగిందా? అనే సమాచారం ఎక్కడా లేదు. ‘మహాకాళీ’ అనే సినిమా ఆయన కథతో రూపొందుతుంది అన్నారు అదేమైందో తెలియడం లేదు.
కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ‘జై హనుమాన్’ సినిమా అనౌన్స్ అయింది. 2025లో రిలీజ్ చేస్తాం అని చెప్పారు. అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్ పనులు అయితే స్టార్ట్ అయినట్లు ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. ఆ మధ్య ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాం అని అయితే చెప్పారు. ఇక అంతకుమందే డీవీవీ దానయ్య తనయుడు హీరోగా ‘అధీర’ అనౌన్స్ చేసి, కొబ్బరికాయ కూడా కొట్టారు. ఆ సినిమా దర్శకుడు మారుతాడు, కథ ప్రశాంత్ వర్మదే అన్నారు. అదేమైందో ఇంకా చెప్పడం లేదు.
ఇదిలా ఉండగా నందమూరి నయా వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమాను భారీ స్థాయిలో అనౌన్స్ చేశారు. రెండ్రోజుల్లో ముహూర్తం ఉంది అనగా ‘ఎవరికో’ అనారోగ్యం అని చెప్పి చేయలేదు. ఇది జరిగి చాలా నెలలు అయింది. అంటే ఆయన అనారోగ్యం సెట్ కాకపోయుండాలి. లేదంటే సినిమా ఆగిపోయుండాలి అని అంటున్నారు. దీంతో ఈ సినిమా కూడా ఏమైందో తెలియదు.
ఇక రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా ఫొటో షూట్, టీజర్ షూట్ కూడా అయింది. కానీ ఆ సినిమా ఆపేశారు. ఆ తర్వాత అదే కథను ప్రభాస్‌తో చేస్తారని వార్తలొచ్చాయి. అదీ కార్యరూపం దాల్చలేదు. చాలా ఏళ్ల క్రితం పూర్తి చేసిన తమన్నా ‘దటీజ్ మహాలక్ష్మి’ అలానే ఉండిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ప్రశాంత్ వర్మ చుట్టూ ఏదో సమస్య ఉందనిపిస్తోంది. అది పరిస్థితులా, లేక ఇంకేదైనా అనేది ఆయనే చూసుకోవాలి.