ఎప్పుడో పదేళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో చేసిన సినిమాలు, వాటి రికార్డులను చెబుతూ ఇప్పటికీ గొప్పయిపోతుంటారు కొంతమంది దర్శకులు. తమ సినిమా గురించి గుర్తొచ్చినప్పుడల్లా ట్వీట్లు చేసుకొని మురిసిపోతుంటారు. అయితే మొన్నటికి మొన్న వచ్చి ఇంకా బజ్‌ను కొనసాగిస్తున్న ‘ఆర్ఆర్‌ఆర్’ గురించి మాత్రం రాజమౌళి పట్టించుకోవడం లేదు. ఆ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా ఇంత బజ్ నడుస్తున్నా ఆయన కనీసం ట్వీట్ కూడా చేయడం లేదు. థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అని చిత్రబృందం చెబుతోంది. అంతటి విజయం సాధించినప్పుడు కార్యక్రమాల్లో మాట్లాడటం తప్ప మళ్లీ ఈ సినిమా గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు ఓటీటీలో సినిమా విడుదలయ్యాక అంతర్జాతీయంగా సినిమాకు మంచి అప్లాజ్ వస్తోంది. హాలీవుడ్ నిపుణులు చాలామంది సినిమా గురించి గొప్పగా సోషల్ మీడియాలో రాస్తున్నారు. దీనిపై రాజమౌళి నుండి ఎలాంటి స్పందన లేదు. తమ సినిమా గురించి అంతలా బజ్ నడుస్తున్నప్పుడు థ్యాంక్యూ అని కూడా మెసేజ్ రావడం లేదు.
సినిమా ఓ మోస్తరు విజయం సాధించిందంటే ఎలివేషన్లు మామూలుగా ఇవ్వని దర్శకులు ఉన్న రోజులివి. మరి రాజమౌళి ఎందుకు అలా చేయడం లేదంటే.. ‘సినిమా రిలీజ్ అయ్యేంతవరకు మనం మాట్లాడాలి. ఆ తర్వాత సినిమానే మాట్లాడుతుంది’ అనే సిద్ధాంతాన్ని ఆయన పాటించడమే అంటున్నారు సన్నిహితులు. రాజమౌళి స్టైల్ చూస్తే.. ఓ సినిమా అయిపోయాక విడుదలయ్యేంతవరకు తెగ ప్రచారం చేస్తారు. ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ అంటూ అన్ని భాషల్లో తిరిగి తిరిగి పరిచయం చేశారు. సినిమా గురించి భారీ భారీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే సినిమా విడుదల తర్వాత చిత్రబృందం సినిమా ప్రచారం గురించి ఆలోచించలేదు. అంతెందుకు సినిమాను ఇతర దేశాల్లో విడుదల చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. అలా చేస్తే వసూళ్లు పెరుగుతాయని అంటున్నారు పరిశీలకులు. కానీ టీమ్ ఆ దిశగా ఆలోచించడం లేదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!