టాలీవుడ్‌లో మోస్ట్ సీనియర్ దర్శక నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన సినిమాలు ఎంత ప్రశ్నించే విధంగా ఉంటాయో, ఆయన ప్రెస్ మీట్‌లు, మాటలు కూడా అంతేలా ఉంటాయి. అయితే ఒక్కోసారి ఏమవుతుందో ఏమో కానీ వైరల్ కంటెంట్ ఆయన నోట వస్తుంది. ఏదో సినిమా గురించో, ఇంకేదో వ్యక్తి గురించో ఆయన మాట్లాడతారు. అందులో కాస్త తెలిసిన కథనం ఉంటే.. ఇంకాస్త డౌట్‌ఫుల్ కథనం ఉంటుంది. తాజాగా ఆయన ఇలాగే ‘అర్జున్’ సినిమా పైరసీ గురించి మాట్లాడారు.
‘అర్జున్’ సినిమా అంటే మహేష్‌బాబు – గుణశేఖర్ ‘అర్జున్’ సినిమా. ఆ సినిమా విడుదల సమయంలో పెద్ద ఇబ్బందులే వచ్చాయి. అప్పుడేం జరిగింది అనేది ఇప్పటి అభిమానులకు తెలియకపోవచ్చు కానీ.. ఆ టైమ్‌లో అయితే మాత్రం మహేష్, అతని ఫ్యాన్స్ చాలా కంగారు పడ్డారు. సినిమా విడుదల సమయంలో పైరసీ వల్ల మొత్తం సినిమా బయటకు వచ్చేసింది. ఎప్పుడో 2004లో ఇది జరిగింది లెండి. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు సుమారు 20 ఏళ్ల తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావించారు.
దీంతోనే అసలు సమస్య మొదలైంది. ఆ సమయంలో మహేష్‌కు తోడుగా ఎవరూ నిలవలేదు అనేది ఆయన చేసిన కామెంట్. అయితే ఆ సమయంలో మహేష్‌కు తోడుగా కొంతమంది నిర్మాతలు వెన్నంటే ఉన్నారు అని చెబుతారు. మరి ఈ విషయం తమ్మారెడ్డికి గుర్తు లేదో లేక ఇంకేదైనా కారణమో ఏమో ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. ‘అర్జున్’ సినిమా పైరసీకి గురైనప్పుడు మహేష్ స్వయంగా పట్టుకున్నా ఎవరూ అండగా నిలబడలేదని, పవన్ ఓ మాట అన్నారు కానీ వచ్చారో లేదో గుర్తు లేదని తమ్మారెడ్డి కామెంట్ చేశారు.
మహేష్ ఇండస్ట్రీ నుండి అంతటి నిస్సహాయతను అనుభవించాడు కాబట్టే అప్పటి నుండి ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నాడని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ‘అర్జున్’ పైరసీ ఘటన విషయంలో పవన్ కల్యాణ్ మాత్రమే కాదు సుమంత్, సురేష్ బాబు, నాగబాబు, అశ్వనీదత్, బూరుగుపల్లి శివరామకృష్ణ, అశోక్ కుమార్ తదితరులు ప్రెస్‌మీట్ పెట్టిమరీ సంఘీభావం చెప్పారని నాటి వార్తల సారాంశం.
అంత జరిగినా ఏమీ జరగలేదు, మహేష్‌కు ఎవరి సాయం దక్కలేదు అని ( Tammareddy Bharadwaja) తమ్మారెడ్డి ఎందుకు అన్నారో అర్థం కావడం లేదు అని మహేష్ ఫ్యాన్స్. దీని వల్ల ఫ్యాన్ వార్స్ వస్తాయని అంటున్నారు. అంతేకాదు ఏం చెప్పినా వింటున్నారు కదా అని ఇలా ఏదేదో చెబుతున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీటికి ఏమైనా తమ్మారెడ్డి స్పందిస్తారేమో చూడాలి.