దర్శకుడిగా తీసినవి రెండు సినిమాలే అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు వేణు ఉడుగుల (Venu Udugula). “నాదీ నీదీ ఒకే కథ, విరాటపర్వం (Virata Parvam)” సినిమాలు కమర్షియల్ గా ఆడకపోయినా సినిమాను తెరకెక్కించే విధానంలో నిజాయితీ ఉండడంతో ఫిలిం మేకర్ గా మంచి రిస్పాక్ట్ సంపాదించుకున్నాడు వేణు ఉడుగుల. ముఖ్యంగా “విరాటపర్వం” షూటింగ్ లెట్ అవ్వడం, విడుదల కూడా వాయిదాపడీ పడీ, చాలా లేటుగా రిలీజ్ అవ్వడం అనేది అతడి కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది.
ఆ తర్వాత దర్శకుడిగా కంటే నిర్మాతగా మారి ఎక్కువ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు వేణు. ఆల్రెడీ నిర్మాతగా ఓ సినిమా ఎనౌన్స్ చేసి ఉన్నాడు. ఇవాళ తన బ్యానర్ లో రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. “విరాట పర్వం” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సాయిలు అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ “రాజు వెడ్స్ రాంబాయి” అనే సినిమాను రిలీజ్ డేట్ తో సహా ప్రకటించాడు.
తెలంగాణలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. ఫిబ్రవరి 14, 2025 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వేణు ఉడుగుల ఆస్థాన విధ్వాంసుడు సురేష్ బొబ్బిలి (Suresh Bobbili) సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మెయిన్ క్యాస్టింగ్ ఎవరు అనేది ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. అయితే.. తాను దర్శకుడిగా సినిమాను తెరకెక్కించడాన్ని పక్కన పెట్టి వేణు ఇలా నిర్మాతగా సొంత బ్యానర్ లో సినిమాలు రూపొందించడం ఏమిటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు తెలుగులో కాస్త సెన్సిబుల్ దర్శకుల లిస్ట్ తక్కువ, ఆ వరుసలో స్థానం సంపాదించుకున్న వేణు ఇలా ప్రొడ్యూసర్ గా పరిమితం అయిపోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తన స్వీయ దర్శకత్వంలో సినిమాల మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇకపోతే.. ప్రేమికుల రోజు రిలీజ్ డేట్ ను ముందుగా బ్లాక్ చేసుకున్న వేణుకు సోలో రిలీజ్ దొరకడం అనేది అసాధ్యం. మరి వేణు నిర్మాతగా ఎలా నిలదొక్కుకుంటాడో చూడాలి.