సినిమా స్థాయి ఏంటో చెప్పేది పోస్టర్లు కాదు.. థియేటర్లకు వచ్చే జనాలు అనే మాట మరోసారి నిరూపితమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతోనే మరోసారి ఈ మాట అర్థమైంది. సంక్రాంతికి మూడు సినిమాలు రాగా.. అందులో ఫైనల్‌గా భారీ వసూళ్లు, ప్రజాదరణ, ఫుట్ ఫాల్స్ ఎక్కువగా సాధించింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే అని అర్థమవుతోంది. వీకెండ్‌లో భారీ స్థాయిలో టికెట్లు తెగాయి అంటున్నారు. ఈ క్రమంలో సినిమా రూ. 300 కోట్ల మార్కు కొట్టడమూ పక్కా అంటున్నారు.
అందులో ఏముంది తెలుగు సినిమాలు చాలా ఇలా రూ.300 కోట్ల మార్కు సాధించాయి కదా అని అనొచ్చు. అయితే అవన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమాలు అనే విషయం ఇక్కడ మరచిపోకూడదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో తెలుగు వాళ్లు ఎక్కుగా ఉండే ప్రదేశాల్లో రిలీజ్ చేశారు. అక్కడ వారి ఆదరణ అదిరిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైన తొలి ఐదు రోజుల్లో రూ.160 కోట్ల మార్కు దాటేసింది.
వీకెండ్ వసూళ్లతో కలిపితే రూ.200 కోట్లు గ్రాస్ పక్కా అని అంటున్నారు. అదే జరిగితే మరో వారంలో రూ.100 కోట్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదు, లేదంటే ఫైనల్ రన్‌లో అయినా రూ.300 కోట్ల మార్కు సాధిస్తాడు వెంకీ (Venkatesh Daggubati) అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే చిరంజీవి తర్వాత ఆ ఫీట్ వెంకీతోనే సాధ్యమవుతుంది. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాతో చిరంజీవి (Chiranjeevi) పాన్ ఇండియా రిలీజ్ లేకుండా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నాడు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమా లాంగ్ రన్‌లో రూ. 236 కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ రికార్డును దాటి సీనియర్ హీరోల్లో బాక్సాఫీసు దగ్గర టాప్‌లోకి వస్తాడు వెంకీ. అదే జరిగితే సీనియర్ హీరోల మధ్య పోటీ మరోసారి రక్తి కడుతుంది అని చెప్పాలి.