లాక్ డౌన్ అనంతరం యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. దీంతో ధైర్యం చేసి కొత్త సినిమాలను విడుదల చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి మంచి స్పందన రావడంతో ఇప్పుడు సంక్రాంతికి నాలుగు సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీతో నాలుగు సినిమాలంటే రెవెన్యూ తక్కువ వస్తుందేమో అనే టెన్షన్ చాలా మందిలో ఉంది.
అయితే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు వరం దక్కేలా ఉంది. తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు కూడా వంద శాతం ఆక్యుపెన్సీ కోసంప్రయత్నిస్తున్నాయి. టాలీవుడ్ సినీ పెద్దలు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతల మండలి తరఫున అధికారికంగా ప్రభుత్వానికి విన్నపం కూడా పంపించేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా సినిమా పరిశ్రమకు వరం ఇవ్వబోతున్నట్లు సమాచారం.
తెలుగు సినిమాలకు సంబంధించి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ఆ సమయానికి గనుక వంద శాతం ఆక్యుపెన్సీ ఇస్తే.. ఆర్థికంగా సినిమాలకు లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు. కానీ కరోనా కాలంలో వంద శాతం ఆక్యుపెన్సీ అంటే ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారో చూడాలి!