ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నటులు నాగచైతన్య (Naga Chaitanya) , శోభిత ధూళిపాళల(Sobhita Dhulipala) గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2027లో వీరు విడిపోతారని ఆయన చేసిన జాతక ప్రకటనలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు ప్రముఖులను కూడా ఆగ్రహానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరాయి.
అలాగే, పలువురు మహిళా హక్కుల సంఘాలు తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి, వేణుస్వామిని విచారణకు పిలిపించాలని విజ్ఞప్తి చేశాయి. మహిళా కమిషన్ గత ఆగస్టులోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే, వేణుస్వామి ఈ నోటీసులకు స్పందించకుండా, కోర్టును ఆశ్రయించి తాత్కాలిక స్టే పొందారు. కోర్టు ఆదేశాలతో విచారణ నిలిపివేయబడింది. కానీ తాజాగా కోర్టు స్టే ఆదేశాలను ఎత్తివేసి, మహిళా కమిషన్ ముందు హాజరుకావాలని వేణుస్వామికి సూచించింది.
ఈ పరిణామంతో మహిళా కమిషన్ మరోసారి నోటీసులు పంపి, నవంబర్ 14న విచారణకు హాజరుకావాలని కోరింది. ఇప్పటికే వివాదాస్పదమైన ఈ కేసు మరింత వేడెక్కింది. గతంలో మా అసోసియేషన్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యింది. ఇక వేణుస్వామి ఈసారి కమిషన్ ముందు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంలో బాధ్యతారహితంగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి (Venu Swamy) ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.