యశ్‌ని వెండితెరపై చూసి మూడేళ్లు అవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో ఆరు నెలల్లో సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు. లేదంటే ఇంకాస్త ఆలస్యం అవ్వొచ్చు. ఆ సినిమా వచ్చాక మరో ఆరు నెలల వరకు యశ్ మళ్లీ సినిమాల్లో కనిపించడు. అలా మొత్తంగా ఓ నాలుగేళ్లుగా యశ్ సినిమాలు రాలేదు అనుకోచ్చు. ఈ మొత్తం గ్యాప్‌ను కవర్ చేయాలని అనుకుంటున్నాడో ఏమో.. వరుస సినిమాలు చేసేలా ప్లానింగ్ వేసుకున్నాడు. ఇప్పటికే రెండు (నిజానికి మూడు) సినిమాలను ఓకే చేసుకున్న యశ్.. ఇప్పుడు మూడో సినిమాను కూడా ఫిక్స్ చేసేశాడు అని చెబుతున్నారు.
యశ్ చేతిలో ప్రస్తుతం ‘రామాయణ’ రెండు భాగాలు, ‘టాక్సిక్’ సినిమా ఉన్నాయి. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో తీసుకొ్తారు. దీంతో ఆ తర్వాత ఆయన చేయనున్న సినిమా ఏదన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు ‘సర్దార్’ సినిమా ఫేమ్ పీఎస్ మిత్రన్ యశ్‌కి ఓ కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి చర్చా జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చింది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో మరోసారి చర్చలు మొదలైనట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మిత్రన్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా ప్రారంభం కావొచ్చని సమాచారం. అప్పటికి ‘టాక్సిక్’ పనులు పూర్తవుతాయి కాబట్టి యశ్ అలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక మిత్రన్ ప్రస్తుతం కార్తితో ‘సర్దార్ 2’ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇక ‘రామాయణ’ విషయానికొస్తే.. యశ్ ఈ సినిమాలో రావణుడిగా కనిపిస్తాడు. అలాగే సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తారట.