ప్రతి శుక్రవారం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కనీసం నాలుగైదు సినిమాలు విడుదలయ్యేవి.. దాంతో ఆడియన్స్ అందరూ థియేటర్ల దగ్గర సగం రోజు గడిపేసేవారు. కానీ.. ఈ శుక్రవారం ఒక్క తెలుగు, హిందీ సినిమా కూడా విడుదలవ్వకపోవడంతో సినిమా ఫ్యాన్స్ అందరూ ఢీలాపడ్డారు. కానీ.. కన్నడ కథానాయకుడు యష్ మాత్రం పండగ చేసుకుంటున్నాడు. డిసెంబర్ 21న విడుదలైన “కె.జి.ఎఫ్” సినిమా ఆ రోజు విడుదలైన తెలుగు సినిమాలను మాత్రమే కాదు బాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది.
ఆ తర్వాత సరైన సినిమా పడకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం మొదలెట్టింది. ఇక.. నిన్న (జనవరి 4) సినిమాలు విడుదల చేసినా ఎలాగూ వచ్చే బుధవారం (జనవరి 9) కల్లా థియేటర్ల నుంచి తీసేస్తారు కాబట్టి తమ సినిమాను విడుదల చేయడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. అందువల్ల ప్రేక్షకులకు “కె.జి.ఎఫ్” తప్ప మరో సినిమా చూడ్డానికి ఆప్షన్ కూడా లేకపోవడంతో.. థియేటర్లకు వచ్చేవారు మల్టీపుల్ టైమ్స్ ఆ సినిమా చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ కారణంగా ఆల్రెడీ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కలిపి 150 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం సంక్రాంతి సంబరం మొదలయ్యేలోపు 200 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అని విశ్లేషకుల అంచనా. మొత్తానికి యష్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు.