నార్మల్ సినిమాలకు కేవలం దుస్తులు, హెయిర్ డ్రెస్ ఉంటే చాలు.. అదే పౌరాణిక సినిమాల దగ్గరకు వచ్చేసరికి చాలా అవసరం అవుతాయి. అందులో ముఖ్యంగా కనిపించేవి ఆభరణాలు. ఇప్పుడు భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ‘రామాయణ’ అనే సినిమా బాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. నితేష్ తివారి (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి రావణుడిగా యశ్ (Yash) నటిస్తున్నాడు.
ఇప్పటివరకు ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే యశ్ ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి అవుతున్నాడు అనేది మాత్రం చెప్పారు. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమాలో రావణుడి పాత్రలో యశ్ ధరించనున్న దుస్తులు, ఆభరణాలు, వాడే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవేనట. రావణుడు స్వర్ణ నగరమైన లంకకు అధిపతి. ఆయన ధరించిన వస్త్రాలు కూడా పసిడి మయమేనని ఇతిహాసాల్లో రాసుకొచ్చారు. అందుకే సినిమాలోనూ ఆ పాత్రను అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే నిజమైన బంగారం వాడితేనే బాగుంటుంది అని భావిస్తున్నారట.
ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెబుతున్నారు. ఈ విషయాన్ని త్వరలో అనౌన్స్ చేస్తారట. ‘రామాయణ’ సినిమాలో యశ్ ముఖ్య పాత్రధారి మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ భాషలతో పాటు వివిధ విదేశీ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఇక ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వినే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం ఇండియన్ సినిమాలో ప్రముఖ నటులు కీలక పాత్రధారులుగా నటిస్తున్నారని టాక్.
ఇక గతంలో వచ్చిన సమాచారం ప్రకారం అయితే.. ఈ సినిమా తెలుగు వెర్షన్ స్క్రిప్ట్, మాటలు పని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేతిలో పెట్టారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి టాక్ ఏమీ వినపడం లేదు. అలాగే అప్పుడు నిర్మాణంలో పార్ట్‌నర్లుగా ఉన్నవాళ్లు ఇప్పుడు లేరు అని కూడా అంటున్నారు.