నూనూగు ప్రాయంలోనే ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.హీరోగా ఎన్టీఆర్ మొదటి చిత్రం నిన్ను చూడాలని. రామోజీ రావు నిర్మాతగా వి ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రొమాంటిక్ లవ్ డ్రామాగా విడుదలైన నిన్ను చూడాలని ఆశించిన విజయం సాధించలేదు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలు పుణికి పుచ్చుకున్న జూనియర్ అరంగేట్రం గ్రాండ్ గా ప్రారంభించాలని చూసినా మూవీ పరాజయం కావడంతో అది కుదరలేదు. దర్శకుడిగా ప్రయత్నాలలో ఉన్న రాజమౌళి తన మొదటి మూవీ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు.
ఎన్టీఆర్ డెబ్యూ కూడా రాజమౌళి మూవీతోనే జరగాల్సింది. ఐతే ఆ మూవీ చర్చలు దశ దాటుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పట్టింది. దీనితో రాజమౌళి డెబ్యూ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ లో ఎన్టీఆర్ నటించారు. తండ్రి మాట కోసం జైలు జీవితం అనుభవిస్తూ లా చదివే స్టూడెంట్ రోల్ లో ఎన్టీఆర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు రాజమౌళి. లా కాలేజీలో విలన్ రాజీవ్ కనకాలతో ఎన్టీఆర్ ఎపిసోడ్స్ తో పాటు హీరోయిన్ గజాల తో రొమాన్స్ సన్నివేశాలు బాగా కుదిరాయి.
కీరవాణి సాంగ్స్ కి ఎన్టీఆర్ స్టెప్స్ మూవీకి ప్రత్యేక ఆకర్షణ తీసుకు వచ్చాయి. ఎన్టీఆర్ సూపర్ డాన్సింగ్ స్కిల్స్ తెలుగు ప్రేక్షకులు తెలిసింది ఈ చిత్రంతోనే. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, అశ్విన్ దత్ నిర్మాతగా తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ వన్ 2001 సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అలా సరిగ్గా 19ఏళ్ల క్రితం రాజమౌళి, ఎన్టీఆర్ ల విజయాత్ర మొదలైంది.