టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మెగా హీరోలు నటించిన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. అయితే 2023 సంవత్సరం మెగా హీరోలకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలిసిరాలేదు. ఎక్కువ సంఖ్యలో మెగా హీరోల సినిమాలు విడుదలైనా మెజారిటీ సినిమాలు నిరాశకు గురి చేశాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కాగా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం పైచేయి సాధించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ సాధించినా భోళా శంకర్ సినిమాతో చిరంజీవి నిరాశపరిచారు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
సినిమా నిడివి తక్కువగా ఉండటం, పవన్ తక్కువ సమయం కనిపించడం, కథనంలో లోపాలు ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి. విరూపాక్ష సినిమాతో హిట్ అందుకున్న సాయితేజ్ బ్రో సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సితార నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాపులు చేరడంతో తర్వాత సినిమాలతో వైష్ణవ్ తేజ్ కచ్చితంగా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. వాల్తేరు వీరయ్య, విరూపాక్ష మాత్రమే మెగా హీరోలు (Mega Heroes) నటించి ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సక్సెస్ అయ్యాయి.