పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. టికెట్ హైక్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు పడినప్పటికీ భారీ ఓపెనింగ్స్ అయితే నమోదయ్యాయి. అలా ఫస్ట్ వీక్ వరకూ ‘వకీల్ సాబ్’ కలెక్షన్ల వర్షం కురిపించాడు. కానీ ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఈ చిత్రం పై పడటంతో కలెక్షన్లు చాలా వరకూ తగ్గిపోయాయి.
దీనికి తోడు ‘వకీల్ సాబ్’ చిత్రం రెండు వారాలకే ఓటిటిలో అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల అవుతుంది అనే ప్రచారం కూడా మొదలైంది. దాంతో కలెక్షన్లు మరింతగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఓ మీటింగ్ పెట్టి అదంతా అసత్య ప్రచారం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు 50 రోజులు పూర్తయ్యేవరకూ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కాదు అని కూడా తెలిపాడు. కానీ 3వ వారం పూర్తవ్వగానే ‘వకీల్ సాబ్’ అమెజాన్ ప్రైమ్లో విడుదల అని అనౌన్స్ చేసేసారు.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు బానే ఉంది. కానీ ఓవర్సీస్ బయ్యర్స్ దగ్గర కూడా ‘వకీల్ సాబ్’ ను 50 రోజుల వరకూ ఓటిటిలో విడుదల చెయ్యము అని అగ్రిమెంట్ చేసుకుని అమ్మారట. ఇంకా ఓవర్సీస్ థియేటర్స్ లో ‘వకీల్ సాబ్’ ఉండగానే అమెజాన్ ప్రైమ్ లో ఇచ్చేసారు. దాంతో దిల్ రాజు అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినందుకు గాను 3 కోట్లు తిరిగి చెల్లించాలి అని వారు డిమాండ్ చేస్తున్నారట. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ‘వకీల్ సాబ్’ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.