గతంలో హిట్టు కొట్టిన కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నమోదవ్వడం ఖాయం. కానీ ఆ అంచనాలకు తగ్గట్టు.. తర్వాత వచ్చిన సినిమా లేకపోతే ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఉదాహరణలు చాలానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ‘వేట’ సినిమాని ఉదాహరణగా చెప్పుకుందాం. ఎందుకంటే 1986వ సంవత్సరం మే 28న ఈ చిత్రం విడుదలయ్యింది, నేటితో ‘వేట’ విడుదలయ్యి 35 ఏళ్ళు పూర్తి కావస్తోంది కాబట్టి.! విషయంలోకి వెళితే.. 1983 వ సంవత్సరంలో చిరంజీవి- దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.
అంతేకాదు చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం కూడా ఇదే..! మళ్ళీ 3 ఏళ్ళ తరువాత ఇదే కాంబినేషన్లో ‘వేట’ అనే పవర్ఫుల్ టైటిల్ తో సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో నమోదయ్యి ఉంటాయో అది మీ ఊహకే వదిలేస్తున్నా..! కానీ బాక్సాఫీస్ దగ్గర చిరు ‘వేట’ ఫలించలేదు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ‘అండర్ రేటెడ్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కానీ బయ్యర్స్ కు ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. అంతేకాదు ఈ చిత్రం ప్లాపవ్వడంతో మెగాస్టార్ వెక్కి వెక్కి ఏడ్చారాట.
మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో మాట్లాడుతూ..” నా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ‘ఖైదీ’. 1983లో విడుదలైన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా నాకు ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దీంతో అదే కాంబినేషన్లో ‘వేట’ సినిమా చేశాం. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. అది ‘ఖైదీ’ ని మించి హిట్ అవుతుందని నేను చాలా ఆశపడ్డాను. కానీ నా అంచనాలు అన్నీ తలక్రిందులు అయిపోయాయి. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం నన్ను కలిచివేసింది. ఆ బాధను తట్టుకోలేక నేను ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ బాధ నుండీ బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.