ఒక సినిమా హిట్ అయ్యిందా.. ఫట్ట్ అయ్యిందా అన్న దానికి గతంలో అనేక కొలమానాలు వుండేవి. శతదినోత్సవం, సిల్వర్ జూబ్లి, గోల్డెన్ జూబ్లీతో పాటు ఎన్ని సెంటర్లలలో ఆడింది అన్న గణాంకాలు వుండేవి. అయితే కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా ఈ వ్యవహారాల్లోనూ మార్పులు వచ్చాయి. రిలీజైన నాటి నుంచి ఎన్నిరోజుల్లో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి.. బాక్సాఫీస్ వద్ద హీరో స్టామినా ఎంత అంటూ రకరకాల ప్రాతిపదికలు వచ్చాయి. అయితే ఈ బాక్సాఫీస్ వసూళ్లు అన్న మాట ఇప్పటిది కాదు..
తెలుగు సినిమా తొలితరం సూపర్‌స్టార్లు ఎన్టీఆర్- ఏఎన్ఆర్‌లు కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డులు తిరగరాశారు. ఒకసారి ఈ కథంటో చూస్తే: పౌరాణికాలు, జానపదాలతో ఎన్టీఆర్.. సాంఘికాలతో ఏఎన్ఆర్‌లు తెలుగు సినిమా బాక్షాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ విషయంలో ఒకసారి ఎన్టీఆర్ గెలిస్తే.. మరోసారి ఏఎన్ఆర్ సత్తా చాటేవారు. దీనిపై ఇద్దరి అభిమాన సంఘాలు కొట్టుకున్న దాఖలాలు కూడా వుండేవి. అయినప్పటికీ ఎన్టీఆర్- ఏఎన్ఆర్‌లు అన్నదమ్ముల్లా వ్యవహరించేవారు. ఈ ఇద్దరి సినిమాలు రోజుల వ్యవధిలో రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేయడమే కాదు.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కాసుల పంట పండించేవి.
అలాంటి వీరిద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ రెండు సంఘటనలు 1967లోనే కావడం విశేషం. ఆ ఏడాది యన్టీఆర్ ‘భువనసుందరి కథ’, ఏయన్నార్ ‘గృహలక్ష్మి’ చిత్రాలు 1967 ఏప్రిల్ 7న విడుదలయ్యాయి. సినిమా రిజల్ట్ విషయానికి వస్తే.. యన్టీఆర్ సినిమా జానపదం, ఏయన్నార్ చిత్రం కుటుంబ కథా చిత్రం. ఈ నేపథ్యంలోనే జనానికి బాగా పరిచయమైన ‘భువనసుందరి కథ’ చిత్రం విజయం సాధించగా, ‘గృహలక్ష్మి’ సినిమా పరాజయం పాలయింది.
అదే ఏడాది ఆగస్టులో మరోమారు ఎన్టీఆర్, ఏయన్నార్‌లు మరోసారి ఒకేరోజు పోటీపడ్డారు. ఎన్టీఆర్ ‘నిండుమనసులు’ సాంఘికం కాగా, ఏయన్నార్ ‘వసంతసేన’ జానపదం. యస్.డి.లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిండు మనసులు’ బ్లాక్-అండ్ వైట్ మూవీ అయితే ‘వసంతసేన’ కలర్ మూవీ. రెండోసారి కూడా ఎన్టీఆరే పైచేయి సాధించడం విశేషం. ‘నిండుమనసులు’ మంచి విజయాన్ని అందుకోగా, ఏఎన్ఆర్ ‘వసంతసేన’ను జనం ఆదరించలేదు.