కరోనా తరువాత అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అదే విధంగా సినిమా ఇండస్ట్రీల్లోనూ మార్పులు వచ్చాయి. ప్రధానంగా రెమ్యునరేషన్‌ల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన వ్యయంని దృష్టిలో పెట్టుకుని స్టార్స్ తమ పారితోషికాలు తగ్గించుకోవాలనరి టాలీవుడ్ నిర్మాతలు కూడా ఆ మధ్య చర్చలు జరిపారు. చాలా వరకు స్టార్ హీరోలు ఈ విషయంలో ముందుకొచ్చారని దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్లు స్టేట్మెంట్‌లిచ్చారు. అది అంత వరకే పరిమితమైంది. ఏ ఒక్క స్టార్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పారితోషికాలు తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు.
తమకున్న డిమాండ్ మేరకు పారితోషికాలు వసూలు చేస్తూనే ఉన్నారు. అయితే తమిళనాట మాత్రం స్టార్స్ పప్పులేవీ ఉడకవంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. తమిళనాట ప్రస్తుతం హీరోలు, నిర్మాతల మధ్య పారితోషికాల విషయంలో వివాదం ముదురుతోంది. అడ్వాన్స్‌లు తీసుకుని కొంత మంది హీరోలు, పేరున్న నటులు డేట్స్ ఇవ్వడంలేదని తమిళ ప్రొడ్యూసర్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పారితోషికాలు తీసుకుని డేట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న హీరోలు, కీలక నటీనటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అయితే తమిళ (Star Heroes) నటులు ధనుష్, శింబు, విశాల్, అధర్వకు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. వారు చేసే తప్పులకు వారినే బాధ్యులను చేస్తూ వారిపై నిషేధం విధించింది. తేనాండాళ్ సినిమా షూటింగ్ కు రాకుండా నిర్మాతకు నష్టం కలిగించాడనే ఆరోపణలపై రజనీకాంత్ మేనల్లుడు, ప్రముఖ హీరో ధనుష్ పై అసోసియేషన్ నిషేధం విధించింది. అసోసియేషన్ సొమ్ము పక్క దారి పట్టించాడనే ఆరోపణలపై హీరో విశాల్ పై గతంలో నిషేధం విధించింది.
నిర్మాతల మండలి చైర్మన్ గా ఉన్న సమయంలోనే విశాల్ పై ఈ ఆరోపణలు వచ్చి అతడిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్ లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సాధారణమే. అలాగే హీరో శింబు, అధర్వపైకూడా నిషేధం విధించారు. ఇలా కోలీవుడ్ లో ప్రముఖ హీరోలపై నిషేధాజ్ణలు విధించడంతో షూటింగ్ లు ముందుకు సాగడం లేదు. వారు ఒప్పుకున్న సినిమాల పరిస్థితి గందరగోళంలో పడింది. దీంతో వారిపై నిషేధం ఎంత కాలం ఉంచుతారో తెలియడం లేదు. కానీ త్వరలో దాన్ని ఎత్తివేసే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది.