విశ్వనాథ శాస్త్రి అంటే అంతగా తెలియక పోవచ్చు కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అనగానే అందరికి టక్కున గుర్తొస్తారు. ‘ప్రేమఖైదీ’ సినిమాతో పరిచయమైన శాస్త్రి గారు ఆ తరువాత జంబలకిడిపంబ, అప్పుల అప్పారావు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా త్వరగా స్టార్ కమెడియన్ గా ఎదిగిన శాస్త్రి గారు ఐరన్ లెగ్ అని పదాన్ని తన పేరు ముందు తగిలించుకున్నారు. అయితే సినిమా కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఎంత త్వరగా స్టారడమ్ వచ్చిందో అంతే త్వరగా పోయింది. ఇక అవకాశాలు సన్నగిల్లడంతో మళ్ళీ స్వగ్రామానికి వెళ్లిపోయారు.
అయితే ఆర్ధిక ఇబ్బందులు ఒకవైపు, అనారోగ్య సమస్యలు మరో వైపు చుట్టేయాడం చిన్నవయసులోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణించాక సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన ఆయన కొడుకు ఎక్కువ రోజులు ఉండలేదు, ఇండస్ట్రీ కంటే నా ఉద్యోగమే మేలని స్వాభిమానం వదిలి ఇండస్ట్రీ ఉండలేమని వెళ్లిపోయారు. ఇక తండ్రి గురించిన విశేషాలను ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు ప్రసాద్. సినిమాల్లోకి యాద్రుచ్చికంగా వచ్చిన విశ్వనాథ్ శాస్త్రి గారు ఐరన్ లెగ్ శాస్త్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన పురోహిత్యం కోసం హైదరాబాద్ వచ్చి అలా సినిమా ప్రారంభోత్సవాలకు పూజ నిర్వహించే పంతులుగా వెళ్లారు. ఇక అలా పూజ సమయంలో ఒకసారి హారతి ఆయన దగ్గరకు రాగానే ఆరిపోయిందట అది చూసి అందరూ నవ్వేశారు. ఇదంతా చూసిన ఈవివి సత్యనారాయణ గారు ఈయనకు ఒక పాత్ర క్రియేట చేస్తే సినిమాలో కామెడీ పండించవచ్చు అని ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలా ఐరన్ లెగ్ శాస్త్రి గా మారిన ఆయన ఎంత గుర్తింపు ఆ పేరుతో తెచ్చుకున్నారో అంతే ఇబ్బందులు పడ్డారని ఆయన కొడుకు ప్రసాద్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
ఒకసారి పని మీద బెంగళూరు వెళ్తుంటే అర్ధరాత్రి బస్ ఆగిపోయిందట. (Ironleg Sastri ) ఐరన్ లెగ్ శాస్త్రి బస్ లో ఉండటం వల్లే ఇలా జరిగిందని చాలా మంది అన్నారట, దీంతో బస్ రిపేర్ చేసాక ఆయనను అక్కడే వదిలేసి వెళ్లిపోయారట. ఇక సినిమాల్లో కూడా ఈయనని పెట్టుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ను కావాలనే కొంతమంది రాజేయడం వల్ల అవకాశాలు తగ్గిపోయాయని అయితే ఇవేవీ ఇంట్లో ఆయన చెప్పేవారు కాదు అంటూ కొడుకు ప్రసాద్ తండ్రి గురించి చెప్పారు.