అగ్ర హీరోల పుట్టిన రోజులు వచ్చినప్పుడు సురేశ్ ప్రొడక్షన్స్ ప్రత్యేక వీడియోలు రూపొందిస్తుంటుంది. ఆ హీరోల సినిమాల గురించి, హీరో గురించి వివరిస్తూ ఆ వీడియోలు భలే ఉంటాయి. దీంతోపాటు ఆ హీరో ఇండస్ట్రీలోకి వచ్చి ఏదైనా మైలురాయి దాటినప్పుడు కూడా ప్రత్యేక వీడియోలు రూపొందిస్తుంటుంది. అలాంటిది ఇంట్లో హీరో నట ప్రస్థానం 35 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు ఇంకెంత సందడి చేయాలి. యూట్యూబ్ దద్దరిల్లిపోవాలి. ఈ రోజు అదే జరిగింది.
వెంకటేశ్… విక్టరీ వెంకటేశ్‌గా అక్కడి నుండి వెంకీ మామగా ఎలా మారారు సినిమా పోస్టర్ల రూపంలో ఓ వీడియో రూపొందించింది. ఆ వీడియోను కానీ వెంకటేశ్ ఫ్యాన్స్ చూస్తే కచ్చితంగా వావ్ అంటారు. అంతలా ఆసక్తికరంగా రూపొందించారు ఆ వీడియోను. తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుండి నిన్న మొన్నటి ‘నారప్ప’ వరకు అన్ని పోస్టర్లను ఒకదాని తర్వాత ఒకటి స్లైడ్ రూపంలో ప్రదర్శించారు. ఆఖరులో అభిమానులను ఉద్దేశిస్తూ వెంకీ చెప్పిన మాటలు ఉంటాయి.
ఇక వెంకటేశ్ నట ప్రస్థానం సంగతి చూస్తే… . రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కలియుగ పాండవులు’ 1986 ఆగస్టు 14న విడుదలైంది. ఆ తర్వాత వైవిధ్య కథల్ని ఎంపిక చేసుకుని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. కుటుంబ కథా ప్రేక్షకుల్ని అలరించే కథల్లో కనిపిస్తూనే మాస్, యూత్‌ను ఆకట్టుకున్నాడు. ఉత్తమ నటుడిగా ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు.