అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లు ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది’ అన్నట్టు.. తెలుగు – తమిళ నటుడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) కూడా నేను గ్యాప్ ఇవ్వలేదు.. అది వచ్చింది అంటే అని అంటున్నాడు. పట్టి చూస్తే మనకు తెలిసేది ఈ విషయమే. ఎందుకంటే ఆయన నుండి గతేడాది ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఆయన నుండి ఐదు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి ‘శబ్దం’ (Sabdham) రేపే వస్తోంది.
ఆది పినిశెట్టి హీరోగా నటించి ‘శబ్దం’ గురించి ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ మాట్లాడుకుంటోంది. అలాగే పనిలో పనిగా తమన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన మరో హీరో అని అంటున్నారు. రీరికార్డింగ్‌తో సినిమాను ఓ లెవల్‌లో కూర్చోబెట్టారు తమన్ (S.S.Thaman) అని కోలీవుడ్ టాక్. ఇక ఆ విషయం వదిలేస్తే తెలుగులోనూ సినిమాకు మంచి హైపే ఉంది.
ఈ సినిమా ప్రచారానికి వచ్చిన ఆది పినిశెట్టి దగ్గర ఏడాదిన్నరగా మీ నుండి సినిమా రాలేదు. తెలుగులో అయితే మీ సినిమా సుమారు మూడేళ్లు అవుతోంది అని అడిగితే ఆసక్తికర విషయం ఒకటి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఓ స్టార్ తెలుగు డైరక్టర్ కొత్త సినిమా గురించి కూడా బయటకు వచ్చింది. దేవా కట్టాతో ఆది ఓ సినిమా చేశారు. ఈ ఏడాదే ఆ సినిమా వస్తుందట. ఏడాదిన్నరగా నా సినిమాలు విడుదల కాలేదేమో. కానీ నేను మాత్రం పని చేస్తూనే ఉన్నాను.
ఈ సంవత్సరం నేను చేసిన ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి అని చెప్పి షాకిచ్చాడు ఆది పినిశెట్టి. ‘డ్రైవ్’ అనే ఓ ప్రయోగాత్మక సినిమా చేశానని చెప్పిన ఆయన.. దేవా కట్టా (Deva Katta) దర్శకత్వంలో ‘మయసభ’ అనే మరో సినిమా కూడా చేశానని తెలిపారు. అలాగే హిట్ సినిమా ‘మరకతమణి’కి (Maragadha Naanayam) సీక్వెల్‌గా తమిళ, తెలుగు భాషల్లో ‘మరకతమణి 2’ షూటింగ్ జరుగుతోందని చెప్పాడు. వీటికితోడు. బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా ‘అఖండ2’ (Akhanda 2) కూడా ఉంది.