సినిమా హిట్ అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న రోజులు ఇవి. అది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఇదే పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడే కాదు గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత ఇంకా ఎక్కువైంది. అంతకుముందు అయితే మామూలుగా జరిగేవి. అలాంటి హిట్ – సంబరాలు కాన్సెప్ట్ ఉన్న సినిమా పరిశ్రమలో ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే సినిమా టీమ్ సంబరాలు జరుపుకోలేదు అంటే నమ్ముతారా? కానీ జరిగింది.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) – అపజయం ఎరుగని ధీరుడు లాంటి దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ (Rajkumar Hirani) కాంబినేషన్‌లో 2014లో వచ్చిన సినిమా ‘పీకే’. ఆ రోజుల్లో ఈ సినిమా బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. అయితే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ టీమ్ ఎవరమూ ఆనందంగా లేమని ఆమిర్ ఖాన్ చెప్పాడు. రాజ్ కుమార్ హిరాణి కూడా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పాడు.
‘పీకే’ సినిమా కథను రాజ్ కుమార్ హిరానీ వేరేలా రాసుకున్నారని, కానీ షూటింగ్ సమయంలో మొత్తం మార్చాల్సి వచ్చిందని ఆమిర్ చెప్పాడు. తాను రాసుకున్న కథ క్లైమాక్స్ మరో సినిమాను పోలి ఉండడంతో.. ఆ కథే తీస్తే కాపీ చేసినట్లు అవుతుందని, క్లైమాక్స్ మార్చేశారట. మొదట అనుకున్న క్లైమాక్స్‌ను తెరకెక్కించినట్లైతే ఇంకా బాగుండేదని అనిపించి టీమ్.. సినిమా విజయం సాధించినప్పటికీ ఆనందంగా లేదు అని ఆమిర్ ఖాన్ చెప్పాడు.
ఆమిర్ ఖాన్ – అనుష్క శర్మ (Anushka Sharma) – సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ప్రధాన పాత్రల్లో నటించిన ‘పీకే’ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ రోజుల్లోనే ఎన్నో రికార్డులను కూడా బద్ధలుకొట్టింది. ఆమిర్ చెప్పింది వింటుంటే సినిమా కథ విషయంలో దర్శకులు, నటులు ఎంత సెంటీగా ఉంటారో తెలుస్తుంది. అనుకున్న కథను అనుకున్నట్లుగా తీయకపోతే బాధపడతారు అని వినడమే కానీ.. ఆమిర్ చెప్పినప్పుడు చాలామందికి తెలిసి ఉంటుంది.