ఈ ఏడాది విడుదల కాబోతున్న భారీ మల్టీస్టారర్ సినిమాలలో ఆచార్య సినిమా ఒకటి. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో కాజల్ నటించగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. రెండున్నరేళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్లు మారాయి. గతేడాది మే 13వ తేదీన విడుదల కావాల్సిన ఆచార్య ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కానుంది.
ఏపీలో టికెట్ రేట్లు పెరగడం ఆచార్య సినిమాకు ఒక విధంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన ఏపీ సర్కార్ ఆచార్య సినిమాకు కూడా టికెట్ రేట్లు కొంతమేర పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే ఆచార్య బయ్యర్లు మాత్రం డిస్కౌంట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. చాలాకాలం క్రితం అడ్వాన్స్ లు ఇచ్చామని రిలీజ్ డేట్లు మారడంతో వడ్డీల భారం తమపై పడిందని బయ్యర్లు చెబుతున్నారని బోగట్టా.
ఆర్ఆర్ఆర్ బయ్యర్లు కూడా డిస్కౌంట్ అడిగినా దానయ్య మాత్రం అందుకు అంగీకరించలేదు. అయితే ఆర్ఆర్ఆర్ నిర్మాత డిస్కౌంట్ ఇవ్వకపోయినా జీఎస్టీ మాత్రం ఇచ్చారని తెలుస్తోంది. ఆచార్య రిలీజ్ కు ఇంకా నెలరోజుల సమయం ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించి విడుదలవుతున్న సినిమా కావడంతో ఆచార్యకు ఇతర రాష్ట్రాల్లో, హిందీలో భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఆచార్యతో చరణ్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందేమో చూడాలి.
త్వరలో ఆచార్య మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. సినిమాలో చిరంజీవి, చరణ్ కాంబో సీన్లు అద్భుతంగా ఉంటాయని సమాచారం అందుతోంది. ఆచార్య సక్సెస్ చిరంజీవికి కూడా ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమాకు అంచనాలకు మించి నిర్మాతలు ఖర్చు చేశారని బోగట్టా.