మెగాస్టార్ చిరంజీవి- నాజర్ కలిసి ఒకే యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. కెరీర్ ప్రారంభంలో వీళ్లిద్దరి బంధం ఎలా ఉండేది అనే విషయాలను నాజర్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “చెన్నైలోని ఓ యాక్టింగ్ స్కూల్ లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. చిరంజీవి కూడా నా బ్యాచ్ మేట్. ఆ టైంలో నేను 60 కిలోమీటర్ల దూరంలో ఉండే చెంగల్‌పట్టు నుంచి చెన్నై వచ్చేవాడిని.
టైమ్‌కు రావాలంటే ఉదయం 6 గంటలకే బయలుదేరాల్సి ఉండేది. ఆ టైములో అన్నం మాత్రం వండుకుని తెచ్చుకునే వాడిని.కూరలు చేసుకునే సమయం ఉండేది కాదు.చిరంజీవి,అలాగే నా స్నేహితులు ఆంధ్ర మెస్ నుంచి తెచ్చుకుని తినేవాళ్లు. ఒకరోజు నేను మాత్రమే తెచ్చుకున్నాను అనే విషయాన్ని చిరు గమనించి.. ‘మీ అమ్మగారిని అంత పొద్దునే వంట చేయమని ఇబ్బంది పెడితే చంపేస్తాను. ఏమనుకున్నావో… రేపటి నుండీ మాతోనే కలిసి భోజనం చెయ్యాలి’ అనేవాడు.
ప్రతీరోజు నేను చిరు వాళ్ళతోనే కలిసి భోజనం చేసే వాడిని. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తయిన తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు. నాకు మాత్రం వెంటనే అవకాశం రాలేదు. దాంతో నేను తాజ్ కోరమండల్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేసేవాడిని. ఓసారి ఆ హోటల్ పక్కనున్న ఫిల్మ్ ఛాంబర్‌లో చిరంజీవిగారు షూటింగ్ చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలీదు నేను భోజనానికి ఇంటికి వెళ్తుంటే అక్కడ జనాలు గుమికూడి ఉన్నారు.
వెళ్లి చూస్తే అక్కడ చిరు షూటింగ్ చేస్తున్నారు. అతను చూడకుండానే నేను వెళ్ళిపోవాలి అనుకుని వెళ్లిపోతుంటే చిరు చూసి వెనుక వచ్చారు. ఏం చేస్తున్నావ్ అని అడిగితే ఇలా హోటల్లో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పాను. ‘అదేంటయ్యా గొప్ప నటుడివి, నువ్వు వెయిటర్ గా పనిచేయడం ఏంటి? రేపు నువ్వు నన్ను వచ్చి కలువు అన్నారు. కానీ నేను వెళ్ళలేదు. కొన్నాళ్ళకి బాలచందర్ గారి వల్ల ఓ సినిమాలో నటించాను.
అప్పటి నుండీ నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇన్నేళ్ళలో చిరు, నేను ఎంత మంచి స్నేహితులం అయినా అతన్ని అవకాశం ఇప్పించమని కోరలేదు. నేను అడగను అన్న విషయం కూడా అతనికి తెలుసు. నాకు ఆత్మగౌరవం ఎక్కువ.. అతనికి నా పై గౌరవం ఎక్కువ” అంటూ నాజర్ చెప్పుకొచ్చారు.