ప్రముఖ నటుడు రోహిత్ బస్ఫోర్ (Rohit Basfore ) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్‌లో నటించిన రోహిత్ మృత దేహం అస్సాంలోని ఓ జలపాతం వద్ద కనిపించింది. ఆదివారం సాయంత్రం గర్బంగా ఫారెస్ట్‌లోని ఓ జలపాతం దగ్గర కొంతమంది ఆ డెడ్ బాడీని చూశారు. ఒంటిపై గాయాలు ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని రోహిత్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోహిత్ కొన్ని నెలల క్రితమే ముంబయి నుండి గౌహతి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం 12 తర్వాత స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లాడు. అయితే ఆదివారం సాయంత్రం నుండి అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారి జరిపిన గాలింపులో ఓ జలపాతం వద్ద రోహిత్ మృతదేహాన్ని గుర్తించారు. అనుమాస్పద మృతి అని అనుకోలేమని, ముఖం, తల, ఇతర భాగాలపై గాయాలు కనిపించాయని పోలీసులు ప్రాథమికంగా తెలియజేశారు.
ఇక కొన్ని రోజుల క్రితం పార్కింగ్ విషయంలో ముగ్గురు వ్యక్తులతో రోహిత్ గొడవ పడ్డాడని, వారే ఈ హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను షార్ట్ ట్రిప్ కోసం జిమ్ ఓనర్ అమర్‌దీప్ ఆహ్వానించాడని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు అమర్‌దీప్ ప్రస్తుతం అందుబాటులో లేడు. ఘటన జరిగినప్పటి నుండి ఆయన అబ్‌స్కాండ్ అయ్యాడని సమాచారం. రోహిత్ బస్ఫోర్ నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వచ్చే నెల నుండి స్ట్రీమింగ్‌కు రానుంది. గతంలో వచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో కూడా రోహిత్ నటించాడు. ఈ క్రమంలో ప్రశంసలు కూడా పొందాడు.