సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి దాదాపు వందకి పైగా సినిమాల్లో నటించాడు. విదేశాల్లో స్టేజ్ షోలు చేశాడు. నటీనటులను, రాజకీయ నాయకులను ఇమిటేట్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసేవాడు. ఈ మధ్యకాలంలో శివారెడ్డి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం సినిమాలు, స్టేజ్ షోలు అంటూ చాలా బిజీగా గడిపేవాడు. ఆ విధంగా రూ.70 లక్షల వరకు దాచుకున్నాడట శివారెడ్డి. సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన ఈ డబ్బుతో హైదరాబాద్ లో ఇల్లు లేదా..
ల్యాండ్ ఏదైనా కొనుక్కోవాలని ఆశ పడ్డాడు. కానీ అతడి స్నేహితుడు శివారెడ్డి దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకొని వాడేశాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శివారెడ్డి. స్నేహితుల కోసం ఏదైనా చూస్తుంటానని.. హైదరాబాద్ వచ్చిన తరువాత కొందరు ఫ్రెండ్స్ అయ్యారని చెప్పాడు. అందులో ఒక ఫ్రెండ్, అతడి ఫ్యామిలీ తనను మోసం చేసిందని.. దాచుకున్న డబ్బుని దోచుకున్నారంటూ చెప్పుకొచ్చాడు. ”నా దగ్గర ఉన్న డబ్బుతో ఇల్లు లేదా భూమి కొందామని సిటీలో తిరిగాను.
అప్పుడు ఏ ఇల్లు చూసినా, ల్యాండ్ చూసినా బాలేదని చెబుతూ మభ్యపెట్టాడు ఓ ఫ్రెండ్. ఇలా మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న సమయంలో అమెరికాలో నాకొక ప్రోగ్రాం ఆఫర్ వచ్చింది. నెలన్నర వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి నేను బాచిలర్ కావడంతో నా డబ్బు తీసుకొని వాళ్లింట్లో పెట్టుకున్నారు. ఆ తరువాత వాళ్ల అవసరాల కోసం వాడుకున్నారు. ఈ విషయం తెలియక అమెరికా నుంచి రాగానే మళ్లీ ఇల్లు చూడడం మొదలుపెట్టాను.
డబ్బులు తీసుకొని వస్తే డీల్ మాట్లాడుకోవచ్చని చెప్పి నా బ్యాగ్ తీసుకురమ్మని ఫ్రెండ్ కి చెబితే.. చిన్న సమస్య రావడంతో డబ్బు వాడుకున్నామని చెప్పాడు. ఐదారు రోజుల్లో తిరిగిస్తానని చెప్పి ఈరోజుకి కూడా డబ్బు ఇవ్వలేదంటూ” చెప్పుకొచ్చాడు శివారెడ్డి. ఆ డబ్బు ఉండి ఉంటే మణికొండలో రెండు, మూడు ఎకరాల భూమి కొని ఉండేవాడినంటూ బాధపడ్డాడు.