సీనియర్ నటుడు, సీనియర్ మా అధ్యక్షుడు అయిన శివాజీ రాజా అంటే తెలియని వారంటూ ఉండరు.నటుడిగా ఆయన 260 కి పైగా సినిమాల్లో నటించారు. సహాయ నటుడిగా, హీరోగా, విలన్ గా ఇలా ఎన్నో రకాల అద్భుతమైన పాత్రలని ఆయన పోషించడం జరిగింది. బుల్లితెర పై మొగుడ్స్ పెళ్ళామ్స్, అమృతం (సీరియల్) తో కూడా ఆయన క్రేజ్ పెరిగింది అని చెప్పాలి. శివాజీ రాజా భీమవరానికి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. శివాజీ రాజా కొన్నాళ్లుగా సినిమాలు తగ్గిస్తూ వస్తున్నారు. ఇంకో రకంగా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు అని చెప్పాలి. అలాగే మీడియాలో కూడా ఆయన ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఇటీవల జరిగిన ‘తలకోన’ అనే సినిమా ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి రాంగోపాల్ వర్మ కూడా అతిథిగా విచ్చేశారు. ఇక శివాజీ రాజా స్పీచ్ ఇస్తున్న క్రమంలో.. వర్మ పై కూడా సెటైర్లు వేయడం చెప్పుకోదగ్గ అంశం.
ఆయన మాట్లాడుతూ.. ” 1985లో నేను సినిమాల్లోకి వచ్చాను. అప్పటివరకు సినీ పరిశ్రమ ఎంతో ప్రశాంతంగా ఉండేది. 1988లో వచ్చిన ‘శివ’ సినిమాతో మాత్రం అలజడి మొదలైంది. రాము అనే పేరులోనే వైబ్రేషన్ ఉంది. ఆయన తీసిన సినిమాల్లో ‘క్షణ క్షణం’ అంటే నాకు బాగా ఇష్టం. ఆ సినిమాలో కనిపించినంత అందంగా శ్రీదేవి ఏ సినిమాలోనూ కనిపించలేదు.ఆయన కంటే సీనియర్ గా ఆయన గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది.
వర్మ తీసినన్ని అద్భుతమైన సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలో ఏ దర్శకుడు తీయలేదు. అలాగే ఆయన తీసినన్ని చెత్త సినిమాలు కూడా మరో దర్శకుడు తీయలేదు. తీయలేడు.. కూడా..! రెండు రికార్డ్స్ కూడా ఆయనకే ఉన్నాయి. ఆయన నుండి నాలాంటి అభిమానులు మంచి సినిమాలు ఆశిస్తారు” అంటూ వర్మ ముందే శివాజీ రాజా కౌంటర్ల వర్షం కురిపించారు. ఈ రకంగా శివాజీ రాజా (Sivaji Raja) గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి.