బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇల్లు, ఆఫీస్ లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. రూ.20 కోట్ల మేరకు సోనూసూద్ పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపింది. కరోనా సమయంలో సోనూసూద్ నిబంధనలకు విరుద్ధంగా రూ.2 కోట్లుగా 10 లక్షల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు తేల్చి చెప్పారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోనూసూద్ ను ప్రశ్నించారు. ఐటీ దాడుల అనంతరం తాజాగా సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
‘ప్రతి భారతీయుని ప్రార్థనల ప్రభావం ఎంతలా ఉంటుందంటే… అధ్వాన్నంగా ఉన్న రోడ్లలో కూడా ప్రయాణం అత్యంత సులభమవుతుంది’ అంటూ క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ షేర్ చేశారు. అందులో ఏం రాసి ఉందంటే.. ”ప్రతీసారి నీ సైడ్ ఆఫ్ స్టోరీను నువ్ చెప్పుకోనక్కర్లేదు. కాలమే చెబుతుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా ఫౌండేషన్ తరపున ఖర్చుచేస్తున్న ప్రతీ రూపాయీ ఒక విలువైన జీవితాన్ని కాపాడటంతో పాటు అర్హులకు చేరుతుంది.
ఇదే విధంగా నేను మద్దతు పలుకుతున్న బ్రాండ్‌ల నుంచి వస్తున్న ఆదాయాన్ని అవసరాల్లో ఉన్న అర్హులకు అందిస్తుంటాను. ఇది నిర్విరామంగా కొనసాగుతుంటుంది. గడచిన నాలుగు రోజులుగా నేను బిజీగా ఉన్నాను. కొంతమంది అతిథుల కారణంగా ప్రజలకు సేవలు అందించలేకపోయాను. మళ్లీ తిరిగి వచ్చి మీకు సేవలు అందిస్తాను. నా జర్నీ ఇలాగే కొనసాగుతుంటుంది.. జై హింద్..” అంటూ రాసుకొచ్చారు.
“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY