మొన్నటికి మొన్న ఓ అనన్య నాగళ్ళను (Ananya Nagalla ) ఇబ్బందికరమైన ప్రశ్న అడిగిందని ఓ జర్నలిస్ట్ మీద మా అసోసియేషన్ మీడియాకి లేఖలు రాసి వెంటనే పరిష్కారం ఇవ్వాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ (అక్టోబర్ 26) “పొట్టేల్” (Pottel) సినిమా సక్సెస్ మీట్ లో, సినిమాలో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) అత్యంత హేయమైన పదజాలంతో రివ్యూ రైటర్ల మీద విరుచుకు పడ్డాడు. భాషలో అసభ్యత లేకపోయినా భావజాలం మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉంది.
Srikanth Iyengar
రివ్యూలు రాసేవాళ్లను మరీ నీచంగా మలాన్ని తినే పురుగులు అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యానించిన విధానం అతడి వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. దర్శకుడిగా జగపతిబాబు (Jagapathi Babu) , భూమిక (Bhumika Chawla) జంటగా 2014”లో “ఏప్రిల్ ఫూల్” (April Fool) అనే సినిమా తెరకెక్కించి ఆ సినిమా ఆడియో ఫంక్షలోనే తన పైత్యాన్ని ప్రదర్శించుకొని.. సినిమా కనీసం ఎప్పుడొచ్చిందో కూడా తెలియని స్థాయి పరాభవం పొంది, దర్శకుడిగా మరో సినిమా తెరకెక్కించడానికి తోడ్పడే నిర్మాత దొరక్కపోవడంతో నటుడిగా మారి, కాస్త పేరు వచ్చి, వరుస ఆఫర్లు దక్కుతుండడంతో నోటికి అదుపులేక..
రివ్యూ రైటర్ల మీద శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) చేసిన కామెంట్లు అత్యంత నీచమైనవి. ఈ కామెంట్లకు కనీసం క్షమాపణ కోరే ఇంగితం ఎలాగూ శ్రీకాంత్ అయ్యంగార్ కు లేదు కాబట్టి, వేదికపై అతడి మాటలకి నిర్లజ్జగా చప్పట్లు కొట్టిన “పొట్టేల్” టీమ్ మీడియాకు, ముఖ్యంగా రివ్యూ రైటర్లకు ఏం సమాధానం చెప్తారో చూడాలి. అయినా మంచి రివ్యూలు వచ్చినప్పుడు ఏ రివ్యూ రైటర్ ను కనీసం స్టేజ్ మీదకు పిలిచి కృతజ్ఞలు చెప్పిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉండవు కూడా. అప్పుడు మాత్రం మా సినిమాకి మంచి రివ్యూలు ఇచ్చారు అంటూ స్టేజ్ మీద వంగి నమస్కారాలు చేస్తారు.
కానీ ఒక సినిమాకి తగ్గ రివ్యూలు ఇస్తే మాత్రం ఎవరూ తీసుకోలేరు. ఎప్పుడైనాసరే ఒక బాగాలేని సినిమాని బాగుంది అని చెప్పిన వెబ్ సైట్లు ఉన్నాయి కానీ.. బాగున్న సినిమాను బాలేదు అని చెప్పినవాళ్ళు ఒక్కరు కూడా లేరు. మరి శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) చేసిన ఈ నీచమైన కామెంట్స్ కి మా అసోసియేషన్ ఎవరికి లేఖ రాస్తుందో చూడాలి. ఇంతకీ మేటర్ ఏంటంటే.. “పొట్టేల్” సినిమాకి దాదాపుగా అన్ని పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. యునానిమస్ గా అందరూ “నిజాయితీగల సినిమా/ప్రయత్నం” అనే మెచ్చుకున్నారు.