ప్రముఖ డాన్సర్, నటి సుధాచంద్రన్ తాను ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన ప్రతీసారి బాధపడుతున్నానని.. కనీసం తనలాంటి సీనియర్ సిటిజన్లకు ఒక నిర్దిష్ట కార్డునైనా జారీ చేయాలంటూ ప్రధాని మోదీకి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక రిక్వెస్ట్ చేశారు. సుధాచంద్రన్ ఒక కారు ప్రమాదంలో తన కాలుని కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నృత్యం చేసి భారతదేశం గర్వపడే స్థాయికి ఎదిగారు. ఈ మేరకు ఆమె తన వృత్తిరీత్యా ప్రయత్నాలు చేస్తుంటారు.
దానికోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన ప్రతీసారి సెక్యూరిటీ తీరుతో తాను చాలా బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమని చెబుతున్నారని.. దీనివలన చాలా బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. అలానే ”ఒక ప్రమాదంలో కాలుని కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో చరిత్ర సృష్టించడమే కాకుండా.. దేశం గర్వపడేలా చేశానని.. అలాంటి నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు
ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ..?” అని ప్రశ్నించారు. మన సమాజంలో ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.