తెలంగాణలో డ్రగ్స్ తీసుకొని ఓ విద్యార్ధిని మృతి చెందడం.. ఆదివారం నాడు బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కసారిగా ఆ పబ్ పై దాడి చేయడం… ఈ కేసులో పలువురు ప్రముఖుల కొడుకులు, కూతుళ్ల పేర్లు బయటకి రావడం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పబ్ యజమానులతో సహా 150 మంది ఈ రైడ్ లో అరెస్ట్ అవ్వడం వారికి లీగల్ నోటీసులు పంపడం కూడా జరిగింది.
దీంతో తెలంగాణలో డ్రగ్స్ కేసులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల వంటి వారు నేరుగా మీడియాకి చిక్కడం.. తర్వాత వాళ్ళు సమర్ధించుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో తనని అన్యాయంగా ఇరికిస్తున్నారు అన్నట్టు ఓ నటి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆమె మరెవరో కాదు..ప్రముఖ షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..’ నేను ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లాను.
మరికాసేపట్లో పార్టీ ముగుస్తుంది కదా.. ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్న టైములో పోలీసులు వచ్చారు.ఆ సమయంలో మేము వారికి సహకరించడం జరిగింది. కానీ అనవసరంగా మా పై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా వాళ్లు నిజానిజాలు తెలుసుకుని ప్రచారం చేస్తే బాగుంటుంది. మాపై తప్పుడు ప్రచారాలు చేసేవారికి మీకు కూడా కుటుంబాలు ఉన్నాయని, గుర్తుంచుకోండి. మా కుటుంబ సభ్యులు ఇవి నిజమే అని భావిస్తే మా పరిస్థితి ఏంటి?
లేట్ నైట్ పబ్‌లో ఉండటం మా తప్పే. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం మాకైతే తెలీదు. తెలిస్తే మేము అక్కడికి వెళ్ళము.’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.