నట దిగ్గజం కోట శ్రీనివాసరావు ఇకలేరు అనే వార్తతో ఇవాళ (జూలై 13) తెలుగు చిత్రసీమ మేల్కొంది. అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా కోట సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలే ఆయన బాత్రూం లో జారిపడడం వల్ల కాలికి కూడా గాయమై మంచానికి పరిమితమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు చేయని పాత్ర లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
నటుడిగానే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఖ్యాతి గడించారు కోట. శంకర్ తెరకెక్కించిన “జెంటిల్మన్, భారతీయుడు” చిత్రాన్ని తమిళ నటుడు గౌండమనికి కోట చెప్పిన డబ్బింగ్ హైలైట్ అయ్యింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. ఇక కోట గాయకుడిగానూ అలరించిన సందర్భాలున్నాయి. 1995లో వచ్చిన “సిసింద్రీ”, 2012లో వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమాల్లో ఆయన పాటలు పాడి ఆకట్టుకున్నారు.
కోట శ్రీనివాస్ కెరీర్లో ఎన్నో వందల పాత్రలు పోషించగా.. “గాయం, లిటిల్ సోల్జర్స్, గణేష్, ఆ నలుగురు, మామగారు, రాజేంద్రుడు గజేంద్రుడు, జంబలకిడి పంబ, ఆమె, మనీ మనీ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అనగనగా ఒకరోజు, ఆమ్మో ఒకటో తారీఖు, అతడు, బొమ్మరిల్లు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” కృష్ణం వందే జగద్గురుమ్, కొండపొలం” చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ మరువలేం.
ఒక పాత్రకు సహజత్వం తీసుకురావడమే కాదు.. ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయిలో విలనిజం, హాస్యం సమపాళ్లలో పండించిన అత్యుత్తమ నటుడు కోట శ్రీనివాసరావు. తెలుగులో పరభాషా నటుల హవా తగ్గించి.. సొంత భాష నటులను ఎంకరేజ్ చేయాలని గొంతు విప్పిన అతికొద్ది మందిలో కోట ఒకరు. పాపం ఆయన్ని యూట్యూబ్ చానల్స్ వాళ్ళ వ్యూస్ కోసం ఇప్పటికే పలుమార్లు చంపేశారు. ఆయన “నేను బ్రతికే ఉన్నాను” అని చెప్పుకోవాల్సి వచ్చింది. అటువంటి దిగ్గజ నటుడికి ఇలాంటి పరిస్థితా అనుకున్న సందర్భమూ లేకపోలేదు. 83 ఏళ్ల కోట శ్రీనివాసరావు మృతి తెలుగు చిత్రసీమకు మాత్రమే కాదు.. యావత్ భారతీయ చిత్రసీమకు తీరని లోటు!